Nara Lokesh: జగన్ కు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh Slams Jagan for Insulting Women

  • వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజం
  • 'సాక్షి'లో మహిళలను, అమరావతిని కించపరిచారని జగన్‌పై లోకేశ్ ఆరోపణ
  • మహిళా లోకానికి జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • అమరావతి దేవతల రాజధాని అని, దాన్ని కించపరిస్తే ఊరుకోబోమని వ్యాఖ్య
  • మహిళల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించినట్లు వెల్లడి
  • జగన్ అనే సైతాన్‌ను అమరావతి తరిమిందని ఘాటు విమర్శలు

వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలను అవమానించిన వారు చరిత్రలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు. జగన్ తన మీడియా సాక్షిగా మహిళలను ఘోరంగా అవమానించారని, ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. సాక్షి చానల్  లో వచ్చిన చర్చా కార్యక్రమంలో ఓ వ్యక్తి అమరావతి మహిళలపై అత్యంత  అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో నారా లోకేశ్ స్పందిస్తూ, "జగన్ గారూ! మహిళలను ఇంత దారుణంగా మీ మీడియా ద్వారా అవమానించడం సమంజసమేనా? తల్లుల ఆత్మగౌరవాన్ని, అమరావతిని ద్వేషిస్తూ మీరు చేస్తున్న అసత్య ప్రచారం మీ పతనానికి పరాకాష్ఠ. ఆకాశం మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది మీ ముఖం మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలని చూస్తే, అది తిరిగి మీ తాడేపల్లి ప్యాలెస్‌కే చేరుతుంది" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి కచ్చితంగా దేవతలు కొలువైన రాజధాని అని లోకేశ్ పునరుద్ఘాటించారు. "భూములు త్యాగం చేసిన తల్లుల అమరావతి ఇది. మూడు రాజధానుల పేరుతో కుట్రలు చేస్తుంటే, 'జై అమరావతి' అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర స్థలం మన రాజధాని. జగన్ అనే సైతాన్‌ను తరిమికొట్టిన అన్ని మతాల దేవుళ్లు, దేవతలు కొలువైన ప్రాంతం అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని ఇంటి నుంచి పంపించేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, వారి గొప్పతనం ఎలా అర్థమవుతుంది?" అని లోకేశ్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల భద్రత, గౌరవం విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని లోకేశ్ గుర్తుచేశారు. "మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను వేధించినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే ఆఖరి రోజని మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేకసార్లు హెచ్చరించారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించడం నేర్పిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడిన వారిని చట్టప్రకారం శిక్షిస్తున్నాం" అని తెలిపారు. అమరావతిపై విషం చిమ్మేందుకు మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గారి బృందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని లోకేశ్ స్పష్టం చేశారు.

మహిళలను కించపరిచేలా "చీర, గాజులు పెడతాం", "ఆడపిల్లలా ఏడవద్దు", "మేమేమీ గాజులు తొడుక్కోలేదు" వంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర మహిళలను అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి గారు తక్షణమే, బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. "లేకపోతే, రాష్ట్రంలో మహిళలను హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగాన్ని పూర్తిగా నయం చేస్తాం. దేవతల రాజధాని అమరావతి... దెయ్యంలాంటి జగన్‌కు తగిన శాస్తి చేస్తుంది" అంటూ లోకేశ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

Nara Lokesh
YS Jagan
Amaravati
Andhra Pradesh Politics
TDP
Women's Respect
Sakshi Media
Chandrababu Naidu
Political Criticism
Telugu News
  • Loading...

More Telugu News