Kishan Reddy: హైదరాబాద్‌లో రఫేల్ తయారీ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్

- హైదరాబాద్‌లో రఫేల్ యుద్ధ విమాన ఫ్యూజ్‌లాజ్‌ల తయారీ
- ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్‌తో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఒప్పందం
- ఫ్రాన్స్ బయట రఫేల్ భాగాల తయారీకి ఇదే తొలి కేంద్రం
- తెలంగాణ విమాన తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం
భారత రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత డసో ఏవియేషన్ సంస్థ యొక్క రఫేల్ యుద్ధ విమానాల ప్రధాన భాగాలైన ఫ్యూసిలేజ్‌లు ఇకపై హైదరాబాద్‌లో తయారు కానున్నాయి. ఈ మేరకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), డసో ఏవియేషన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి వెల్లడించారు.
రఫేల్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించి ఫ్రాన్స్ వెలుపల ఇటువంటి అత్యాధునిక విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ ఒప్పందం ద్వారా రఫేల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూసిలేజ్‌లను హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఉత్పత్తి చేయనుంది. ఈ పరిణామం తెలంగాణలో విమాన తయారీ పరిశ్రమ విస్తరణకు, దేశీయ సంస్థలు తమ తయారీ సామర్థ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడానికి దోహదపడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచ రక్షణ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రక్షణ ఎగుమతులలో భారత్ ప్రగతి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రక్షణ ఎగుమతులు గణనీయంగా వృద్ధి చెందాయని కిషన్ రెడ్డి తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 686 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 2024-25 నాటికి రూ. 23,622 కోట్లకు చేరాయని ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్ 80కి పైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని, ఇది దేశానికి గర్వకారణమని అన్నారు.
దిగుమతుల నుంచి ఎగుమతుల వైపు ప్రస్థానం
"ఒకప్పుడు మనం దిగుమతి చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మనమే తయారు చేస్తున్నాం, మనమే ఎగుమతి చేస్తున్నాం" అంటూ భారత్ సాధిస్తున్న ప్రగతిని కిషన్ రెడ్డి కొనియాడారు. భారత్ విశ్వసనీయమైన ప్రపంచ రక్షణ ఉత్పత్తి కేంద్రంగా ఎదుగుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.