Chandrababu Naidu: పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటా: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Warns Leaders on Poor Performance

  • కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై 12న రాష్ట్రవ్యాప్త విజయోత్సవ ర్యాలీలు
  • అదే రోజు అమరావతిలో ఎన్డీయే నేతలు, అధికారులతో సీఎం సమీక్ష
  • తల్లికి వందనం, అన్నదాత పథకాలు ఈ నెలలోనే, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు
  • జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో భారీ యోగా కార్యక్రమం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల పనితీరు సంతృప్తికరంగా లేకపోతే వారిని పదవుల నుంచి తొలగించడానికి వెనుకాడబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన కరాఖండిగా స్పష్టం చేశారు. తొలిసారి గెలిచిన శాసనసభ్యులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అతివిశ్వాసానికి పోతే తీవ్ర నష్టం తప్పదని హితవు పలికారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంగా ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని, అదే రోజు అమరావతిలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయిల్లోని పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వంతో పాటు పార్టీలోని ప్రతి ఒక్కరి పనితీరుపైనా తాను నిరంతరాయంగా సర్వేలు చేయిస్తున్నానని, ఎప్పటికప్పుడు సమాచారం సమీకరిస్తున్నానని చంద్రబాబు తేల్చిచెప్పారు. "మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది నా ఆకాంక్ష. అధికారంలో ఉన్న మనల్ని ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. కాబట్టి, ప్రతి అడుగు ఆచితూచి వేయాలి" అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ప్రతి ఆరు నెలలకోసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలు తెప్పించుకుంటానని, మెరుగైన పనితీరు కనబరిస్తే అభినందించి, మరిన్ని అవకాశాలు కల్పిస్తానని, లోపాలుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంలో రాజీ పడేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. "వ్యవస్థకు నష్టం కలిగించే ఏ ఒక్కరినీ ఉపేక్షించను. మెజారిటీ ప్రజాప్రతినిధులు తమ పనితీరుతో ప్రజలకు చేరువయ్యారు. అయితే, కొందరి వల్ల నష్టం వాటిల్లుతోంది. త్వరలోనే ప్రతి ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా సమావేశమవుతాను," అని సీఎం పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నెల 12న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు, సాయంత్రం అమరావతిలో సమీక్ష ఉంటుందన్నారు. "గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయింది. ఏడాదిలోనే మనం స్పష్టమైన మార్పు తీసుకొచ్చాం. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి," అని సూచించారు. ఈ నెల 12 లేదా 14లోగా 'తల్లికి వందనం', ఈ నెలలోనే 'అన్నదాత', ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులిచ్చామని, 2027 నాటికి పోలవరం పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని, పోలవరం - బనకచర్ల అనుసంధానంతో తెలంగాణకు నష్టం లేదని స్పష్టం చేశారు.

Chandrababu Naidu
Andhra Pradesh
TDP
Coalition Government
MLA Performance
Governance
Polavaram Project
Free Bus Travel
Public Service
Review Meeting
  • Loading...

More Telugu News