మహిళా ఎస్‌ఐపై చేయి చేసుకున్న కాంగ్రెస్‌ నేత.. వీడియో వైర‌ల్‌!

  • ఖమ్మం జిల్లా కల్లూరులో ఘ‌ట‌న‌
  • నిన్న‌ రాత్రి కల్లూరు ఎన్‌ఎస్పీలోని ఓ హోటల్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేత రాము
  • పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం
  • పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన హోట‌ల్ యాజ‌మాన్యం
  • ఘటనాస్థలికి చేరుకున్న కల్లూరు ఎస్‌ఐ హరిత
  • పోలీసులను దూషిస్తూ మహిళా ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగిన రాము అనుచ‌రులు
ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్‌ నేతలు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐపై దాడి చేశారు. ఆమె ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు… నిందితుడిని, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే... నిన్న‌ రాత్రి తల్లాడకు చెందిన కాంగ్రెస్‌ నేత రాయల రాము కల్లూరు ఎన్‌ఎస్పీలోని ఓ హోటల్‌కు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న రాము.. పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నాడు. గొడవ ముదరడంతో రాము తన అనుచరులకు సమాచారం ఇచ్చాడు. తల్లాడ నుంచి కల్లూరుకు భారీగా చేరుకుని హల్‌చల్‌ చేశారు.

దీంతో హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న కల్లూరు ఎస్‌ఐ హరిత.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వారు వినకపోవడంతో పాటు మరింత రెచ్చిపోయారు. కాంగ్రెస్ నేత రాయలు రాము సహా అతని అనుచరులు పోలీసులను దూషిస్తూ మహిళా ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. పరుష పదజాలంతో ఆమెను దూషించారు. 

దీంతో ఎస్‌ఐ హరిత.. రాముపై చేయి చేసుకున్నారు. కాంగ్రెస్‌ నాయకుడు రాము… నన్నే కొడతావా అంటూ విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ హరిత పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. మహిళా అని కూడా చూడకుండా ఆమె భుజాన్ని బలంగా నెట్టివేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. 

అప్రమత్తమైన పోలీసులు రాముతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


More Telugu News