Narendra Modi: మోదీకి కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫోన్ కాల్... జీ7 సదస్సుకు ఆహ్వానం

- భారత్-కెనడా సంబంధాల్లో సానుకూల పరిణామం
- కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి మోదీకి ఫోన్ కాల్
- పరస్పర గౌరవంతో కలిసి పనిచేస్తామని ఇరు నేతల ప్రకటన
- ఈ నెలలో కనానాస్కిస్‌లో జీ7 సదస్సు
భారత్, కెనడా దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయి, ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న ఇరు దేశాల సంబంధాలు, ఆయన తర్వాత ప్రధాని పీఠమెక్కిన మార్క్ కార్నీ చొరవతో తిరిగి గాడిన పడుతున్నాయని స్పష్టమవుతోంది.
ఈ నెలలో కెనడాలో జరగనున్న జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీని మార్క్ కార్నీ స్వయంగా ఆహ్వానించడమే ఇందుకు నిదర్శనం. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రధాని మోదీ, కార్నీతో భేటీ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
కెనడా ప్రధాని మార్క్ కార్నీ శుక్రవారం తనకు ఫోన్ చేశారని, ఈ సందర్భంగా ఆయనకు ఎన్నికల విజయం పట్ల అభినందనలు తెలిపి, జీ7 సదస్సు ఆహ్వానానికి ధన్యవాదాలు తెలియజేశానని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
"కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి ఫోన్ కాల్ రావడం సంతోషంగా ఉంది. ఆయన ఇటీవలి ఎన్నికల విజయానికి అభినందనలు తెలిపాను. కనానాస్కిస్‌లో జరిగే జీ7 సదస్సుకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా, లోతైన ప్రజా సంబంధాలు కలిగిన భారత్, కెనడా పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ప్రాతిపదికన నూతనోత్సాహంతో కలిసి పనిచేస్తాయి. సదస్సులో మన భేటీ కోసం ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 17 వరకు జీ7 సమావేశాలు జరగనున్నాయి.