KA Paul: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కేఏ పాల్ కామెంట్స్

- ఇటీవల బెంగళూరులో తొక్కిసలాట... 11 మంది మృతి
- దేశంలో ఏం జరుగుతోందంటూ కేఏ పాల్ విచారం
- లక్షల మందితో పరేడ్ కు ఎలా అనుమతించారని ప్రశ్న
బెంగళూరులో ఇటీవల ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల తీవ్ర తొక్కిసలాట జరిగిన 11 మంది మరణించడం తెలిసిందే. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. "బెంగళూరులో పోలీసులు అనుమతి ఇవ్వకుండా, ఆపకుండా వేలు, లక్షల మందితో పరేడ్ చేసుకోవడం, ఆ సెలబ్రేషన్స్‌లో 11 మంది చనిపోవడం, 50 మంది గాయపడటం చూస్తుంటే దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో లక్షల మందితో పరేడ్‌కు ఎలా అనుమతించిందని ఆయన ప్రశ్నించారు.
తన ప్రజాశాంతి సభలకు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. "నా సభకు వెయ్యి మందితో జింఖానా గ్రౌండ్స్‌లో, కళ్లు మూసుకుని, ప్రీచింగ్ చేయకుండా కేవలం ప్రేయర్స్ చేసుకోవాలని ఆంక్షలు పెడుతున్నారు. కొందరికి ఒక న్యాయం, మరికొందరికి మరో న్యాయమా?" అని నిలదీశారు. "ఇష్టం వచ్చినట్టు కొంతమంది పోలీసులు చేస్తున్నారు, అందరూ కాదు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మార్పు రావాలి" అని పాల్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం ఉందా, లేదా అనే సందేహం కలుగుతోందని, ఈ మార్పును మనమే తీసుకురావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయాలపై తాను స్పందిస్తానని, అవసరమైతే రంగంలోకి దిగుతానని పాల్ తెలిపారు.
అదే సమయంలో, ఇతర ఘటనలపై కేఏ పాల్ స్పందిస్తూ, పోలీసుల తీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. "ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజుల క్రిందట ముగ్గురు యువకులను నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీసులు కొట్టడం చట్ట విరుద్ధం. ఇది ఆలోచిస్తుంటే చాలా విచారంగా, షాక్‌గా ఉంది" అని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణలోని నిర్మల్‌లో జరిగిన ఒక ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. "నిర్మల్‌లో ఒక రైతు బిడ్డ ఎంఆర్ఓ ఆఫీస్‌కు వెళితే, ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఒక దొంగో, టెర్రరిస్టో అయినట్టు బయటకు నెట్టేయడం బాధాకరం. తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి" అని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.