Tirumala Laddu: తిరుమల లడ్డూకు నకిలీ నెయ్యి.. హైకోర్టులో సీబీఐ

- టీటీడీ లడ్డూ ప్రసాదానికి నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు
- భోలేబాబా డెయిరీయే ప్రధాన సూత్రధారి అని తేల్చిన సీబీఐ సిట్
- పామాయిల్, రసాయనాలతో కల్తీ నెయ్యి తయారీ చేసి సరఫరా
- సాక్షులను బెదిరిస్తున్న నిందితులు, బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదన
- నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జూన్ 17కు వాయిదా
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యి అసలుది కాదని, అది పామాయిల్, రసాయనాలతో తయారుచేసిన నకిలీ నెయ్యి అని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి భోలేబాబా డెయిరీ అని, టీటీడీ బ్లాక్ లిస్టులో ఉన్నందున ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీలను ముందుపెట్టి ఈ దందా నడిపించిందని సీబీఐ తరఫు న్యాయవాది పీఎస్‌పీ సురేష్‌కుమార్ గురువారం వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపిందని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. భోలేబాబా డెయిరీకి పాలు సేకరించి నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థే లేదని, ఈ విషయాన్ని రైతులే స్వయంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. కేవలం పామాయిల్, రసాయనాలు, ఇతర ముడిపదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి, ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలిందని వివరించారు. భోలేబాబా డెయిరీని టీటీడీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో, ఈ రెండు డెయిరీలతో ఒప్పందం కుదుర్చుకుని పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ మోసానికి పాల్పడినట్లు ఆధారాలున్నాయని తెలిపారు. వాట్సప్ గ్రూప్ చాటింగ్ వివరాలను కూడా సేకరించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసులో నిందితులు ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వారని, దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ 2025 ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాగా, నిందితులు ఆయనపై దాడి చేసి, బెదిరించి, చెన్నై మీదుగా బలవంతంగా ఢిల్లీకి తిప్పి పంపించారని తెలిపారు. అలాగే, మరో నిందితుడు అశిష్ రోహిల్లా నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధపడగా, అతనికి తెలియకుండానే అతని పేరు మీద హైకోర్టులో పిటిషన్ వేశారని, ఈ విషయాన్ని రోహిల్లా స్వయంగా హైకోర్టు రిజిస్ట్రార్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారని కోర్టుకు వివరించారు. ఈ పరిస్థితుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులకు తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని, కాబట్టి వారి బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని సీబీఐ బలంగా వాదించింది.
అంతకుముందు, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. తమ క్లయింట్లు గత నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారని, దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని, సిట్ చార్జిషీట్ కూడా దాఖలు చేసిందని తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయని, నిందితులు అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఏఆర్ డెయిరీ మాత్రమే టీటీడీతో ఒప్పందం చేసుకుందని, భోలేబాబా, వైష్ణవి డెయిరీల డైరెక్టర్లకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని వాదించారు. కోర్టు విధించే ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉంటామని, బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.
బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన వారిలో ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్ (నిందితుడు-2), భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్ (నిందితుడు-3), విపిన్ జైన్ (నిందితుడు-4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావడా (నిందితుడు-5) ఉన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ నిందితుల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తదుపరి విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేశారు.