RCB: చిన్నస్వామి స్టేడియం విషాదం: మృతుల కుటుంబాలకు ఆర్సీబీ రూ.10 లక్షల సాయం

RCB Announces 10 Lakhs Aid for Chinnaswamy Stadium Tragedy Victims
  • చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది మృతి
  • మృతుల కుటుంబాలకు ఆర్సీబీ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
  • క్షతగాత్రుల చికిత్సకు 'ఆర్సీబీ కేర్స్' ద్వారా నిధుల సేకరణకు నిర్ణయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 11 మంది అభిమానులు మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో, మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఆర్సీబీ యాజమాన్యం ముందుకు వచ్చింది. మరణించిన ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్సీబీ తమ అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా వెల్లడించింది.

ఈ ఘటనలో గాయపడిన వారికి కూడా అండగా నిలవాలని ఆర్సీబీ నిర్ణయించింది. వారి చికిత్స ఖర్చుల నిమిత్తం 'ఆర్సీబీ కేర్స్' పేరిట ప్రత్యేకంగా నిధులు సేకరించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉండగా, కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ దుర్ఘటనపై తక్షణమే స్పందించి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ దుర్ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. "చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా అభిమానులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం" అని ఆర్సీబీ తమ ప్రకటనలో పేర్కొంది. మీడియా కథనాల ద్వారానే ఇది తమ దృష్టికి వచ్చిందని, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపింది.

"మాకు ప్రతి ఒక్కరి క్షేమం అత్యంత ముఖ్యం. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే మా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నాం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. స్థానిక అధికారులకు మా పూర్తి సహకారం అందిస్తాం. ఈ కష్ట సమయంలో మాకు మద్దతుగా నిలిచే వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి" అని ఆర్సీబీ యాజమాన్యం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో అభ్యర్థించింది.
RCB
Royal Challengers Bangalore
Chinnaswamy Stadium
stampede
fan death
RCB Cares

More Telugu News