Demis Hassabis: ఏఐతో ఉద్యోగాలు తగ్గడం నిజమే కాని అదే జరిగితే మరీ అత్యంత ప్రమాదకరం: గూగుల్ డీప్‌మైండ్ సీఈవో

Demis Hassabis on AI job losses and misuse risks
  • ఏఐతో ఉద్యోగాల కోత కంటే దుర్వినియోగమే పెద్ద ప్రమాదమన్న డెమిస్
  • చెడ్డ వ్యక్తుల చేతికి ఏఐ వెళితే వినాశకర పరిణామాలని వ్యాఖ్య
  • ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు ఏఐతో తగ్గుతాయన్న డెమిస్
  • ఏఐ దుర్వినియోగాన్ని ఆపడానికి ప్రపంచ సహకారం అవసరమని సూచన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ వేగంగా విస్తరిస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ సాంకేతికత వల్ల మానవ జీవితంలో సౌలభ్యంతో పాటు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఏఐ గురించి కీలకమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం కంటే దాన్ని దుర్వినియోగం చేయడమే అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

కృత్రిమ మేధ వల్ల ఎదురయ్యే సవాళ్లపై డెమిస్ హస్సాబిస్ తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశారు. ఏఐ మనుషుల ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే విషయం కంటే, ఈ శక్తివంతమైన సాంకేతికత దురుద్దేశాలున్న వ్యక్తుల చేతుల్లోకి వెళితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఒకవేళ అలా జరిగితే ఊహించని వినాశకర పరిస్థితులు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. అలాంటి వారికి ఏఐ యాక్సెస్‌ను పరిమితం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల తగ్గుతాయని వెల్లడీ

అయితే ఇదే సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతమైన పనులను సులభంగా, సమర్థవంతంగా పూర్తి చేయవచ్చని కూడా ఆయన తెలిపారు. ఏఐ ప్రభావం వల్ల ముఖ్యంగా ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డెమిస్ అంగీకరించారు. సాధారణంగా చేసే చిన్న చిన్న పనులను ఏఐ టూల్స్ నిర్వహించడం వల్ల మానవులు మరింత కీలకమైన, సృజనాత్మకమైన పనులపై తమ దృష్టిని కేంద్రీకరించడానికి వీలు కలుగుతుందని ఆయన వివరించారు. దీనివల్ల మరింత నైపుణ్యంతో కూడిన కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని హస్సాబిస్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, ఏఐ శక్తి, దాని వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగాన్ని నిరోధించడానికి అంతర్జాతీయ సహకారం అత్యంత ఆవశ్యకమని ఆయన నొక్కిచెప్పారు.
Demis Hassabis
Google DeepMind
Artificial Intelligence
AI risks
AI misuse
AI jobs
AI impact

More Telugu News