Telugu Movies: ఈసారి సంక్రాంతికి త్రిముఖ పోటీ.. పండ‌క్కి మ‌రో స్టార్ హీరో సినిమా

Chiranjeevi Naveen Raviteja Sankranthi 2026 Movie Releases

  • ప్ర‌తి ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి కొత్త సినిమాల సంద‌డి
  • ఈసారి చిరు, న‌వీన్ పొలిశెట్టి, ర‌వితేజ చిత్రాలు విడుద‌ల‌
  • గ‌తేడాది కూడా మూడు సినిమాల మ‌ధ్య త్రిముఖ పోటీ

ప్ర‌తి ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి కొత్త సినిమాల సంద‌డి ఎక్కువ‌గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. దీంతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంటాయి. దీనికోసం ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు ముందుగానే బెర్త్‌లు క‌న్ఫార్మ్ చేసుకుంటారు. ఇక‌, వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ముఖ్యంగా మూడు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించడానికి సిద్ధమ‌వుతున్నాయి. 

చిరు-అనిల్ రావిపూడి బిగ్ ప్రాజెక్ట్‌
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన బిగ్ ప్రాజెక్ట్ చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ. 'మెగా 157' గా ఇది ప్ర‌చారంలో ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే మేక‌ర్స్ ఈ భారీ ప్రాజెక్టులో ఆమెను క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్లు ఓ ప్ర‌త్యేక వీడియో ద్వారా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

'సరిలేరు నీకెవ్వరు', 'భగవంత్ కేసరి', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి వ‌రుస‌ హిట్ చిత్రాలు అందించిన‌ దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీని 'మెగా 157' కి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండ‌గా... షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.    

కాగా, ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి, 2026 సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

న‌వీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు'
ఈ సంక్రాంతి బ‌రిలో ఉన్న రెండో సినిమా న‌వీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు'. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స‌ర‌స‌న‌ మీనాక్షి చౌదరి క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇటీవ‌లే మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14 విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

సంక్రాంతి బ‌రిలో మాస్ మహారాజా కొత్త చిత్రం
మాస్ మహారాజా రవితేజ తన అభిమానులకు పండగలాంటి వార్త అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

గురువారం ఈ సినిమా పుజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. 'ర‌వితేజ 76' ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం 'అనార్కలి' అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రవితేజ మార్క్ మాస్ ఎంటర్‌టైనర్ అంశాలతో పాటు, ఈ టైటిల్ కాస్త భిన్నంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రవితేజ తనదైన ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకుంటూనే, ఈ చిత్రంతో ఒక కొత్తదనంతో కూడిన కథను ప్రేక్షకులకు అందించనున్నారని తెలుస్తోంది. 

ఇలా ఇప్ప‌టివ‌ర‌కు ఈ మూడు సినిమాలు 2026 సంక్రాంతి బ‌రిలో నిలిచాయి. దీంతో ఈసారి త్రిముఖ పోటీ ఉండ‌నుంది. ఇంకా ఆరు నెల‌ల స‌మ‌యం ఉండ‌డంతో మ‌రిన్ని చిత్రాలు సంక్రాంతి బెర్త్ కోసం పోటీ ప‌డే అవ‌కాశం ఉంది. గ‌తేడాది కూడా ఇలాగే మూడు సినిమాలు (గేమ్ ఛేంజ‌ర్‌, డాకు మ‌హారాజ్, సంక్రాంతికి వ‌స్తున్నాం) ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన విష‌యం తెలిసిందే.  

Telugu Movies
Chiranjeevi
Mega 157
Anil Ravipudi
Nayanathara
Naveen Polishetty
Anaganaga Oka Raju
Raviteja
Kishore Tirumala
Sankranthi 2026
  • Loading...

More Telugu News