- విదేశాల్లో విహరిస్తూ వెళుతున్న కథలు
- భారీతనంతో భయపెడుతూ వస్తున్న సినిమాలు
- ప్రేక్షకుల అభిరుచిలో మార్పు
- తమిళ .. మలయాళ భాషల్లో సహజత్వానికి పెద్దపీట
- కథాబలం కలిగిన సినిమాలకే ఆదరణ
ఏ కథకైనా స్థానికత అవసరం .. ఇది మన ఊరు కథ .. మనచుట్టూ జరుగుతున్న కథ అనే భావన ఆడియన్స్ కి కలగాలి. అప్పుడే ఆ కథకి వాళ్లు కనెక్ట్ అవుతారు. అలా కాకుండా కథ అనేది ఫారిన్ రోడ్లపై పరిగెత్తుతూ ఉంటే, హీరో అనేవాడు ఆకాశంలో నుంచి ఊడిపడినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే, ఇది మనకి సంబంధించిన కథ కాదు .. తెరపై ఎమోషన్స్ తో మనకి పనిలేదని అనుకుంటాడు. అక్కడే కథ నుంచి ప్రేక్షకుడు వేరైపోతాడు. ఆడియన్స్ మనసులలోకి వెళ్లలేకపోయిన కథ, థియేటర్లలోని కుర్చీల సందులో కూలబడుతుంది.

ఎన్నో వందల సినిమాలకి కథలను అందిస్తూ వచ్చిన పరుచూరి బ్రదర్స్ కూడా, చాలా సందర్భాలలో స్థానికత గురించి ప్రస్తావించారు. కథానాయకుడు మనవాడే .. మనలాంటివాడే అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలగాలి. పదిమందిని కొట్టే హీరో కంటే కూడా, తమకు మాదిరిగా పరిస్థితులను ఎదుర్కొనే సామాన్యుడైన కథానాయకుడినే వారు ఇష్టపడతారు. ఇటీవల తమిళం నుంచి వచ్చిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' .. మలయాళం నుంచి వచ్చిన 'తుడరుమ్' సినిమాలు కూడా ఇదే విషయాన్ని మరోమారు నిరూపించాయి.

అందరినీ అనుమానిస్తూ .. అహంభావంతో నాలుగు గోడల మధ్య కూర్చోకు. అందరినీ కలుపుకుపోతూ జీవించడంలోనే అసలైన ఆనందం ఉందని 'టూరిస్ట్ ఫ్యామిలీ' చెబుతుంది. తన కుటుంబం కోసం అన్నింటినీ ఓర్చుకుని సహనంతో సర్దుకుపోయే సామాన్యుడు, ఆ కుటుంబమే దెబ్బతినే పరిస్థితి వస్తే మొండి ధైర్యంతో ముందుకు వెళతాడనే విషయాన్ని 'తుడరుమ్' చెబుతుంది. భాషలు వేరైనా ఈ రెండు కథలు ఆడియన్స్ కి కనెక్ట్ కావడానికి కారణం, అవి సామాన్యుడి నుంచి పుట్టినవే కావడం .. సామాన్యుడి చుట్టూ తిరిగేవే కావడం అని చెప్పాలి.