- గ్లామరస్ హీరోయిన్ గా మార్కులు కొట్టేసిన ఆషికా
- 'నా సామిరంగ'తో దక్కిన హిట్
- 'విశ్వంభర' కోసమే ఆమె ఫ్యాన్స్ వెయిటింగ్
- రవితేజ జోడీగా ఛాన్స్ అంటూ టాక్
తెలుగు తెరపైకి చాలామంది అందమైన కథానాయికలు వచ్చారు .. అలరించారు. అందం విషయంలో .. ఆకర్షణ విషయంలో ఒకరితో ఒకరిని పోల్చలేం. విశాలమైన కళ్లతో ఒకరు .. చక్కని చిరునవ్వుతో మరొకరు .. ఆకర్షణీయమైన రూపంతో ఇంకొకరు .. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విశేషంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వచ్చారు. అలా నాజూకుదనం వైపు నుంచి ఆకట్టుకున్న కథానాయికగా ఆషికా రంగనాథ్ కనిపిస్తుంది.

'అమిగోస్' సినిమాతో ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పాలరాతి శిల్పం లాంటి ఈ బ్యూటీని చూసిన మరుక్షణమే కుర్రాళ్లంతా ఆమె అభిమానులుగా మారిపోయారు. అందానికి నిర్వచనం ఆమెనే అని ఫిక్స్ అయ్యారు. 'నా సామిరంగ' సినిమాతో ఆమెకి భారీ విజయాన్ని కట్టబెట్టారు. 'విశ్వంభర'లో ఆమె పాత్ర ఎలా ఉండనుందా? ఆమె ఎలా కనిపించనుందా? అనే ఒక కుతూహలంతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె రవితేజ సరసన మెరవనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

రవితేజ - కిశోర్ తిరుమల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం ఉందట. అందువలన ఆషికా రంగనాథ్ .. కేతిక శర్మలను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి 'అనార్కలి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాతో మరో పెద్ద ప్రాజెక్టు ఆషికా ఖాతాలో చేరిపోయినట్టే అనుకోవాలి మరి.