Bilawal Bhutto: కశ్మీర్‌పై మా ప్రయత్నాలు ఫలించలేదు.. అంతర్జాతీయంగా ఎదురుదెబ్బలు తగిలాయి: ఐరాసలో బిలావల్ భుట్టో

Bilawal Bhutto admits Kashmir efforts failed at UN
  • అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బలు తప్పలేదని అంగీకరించిన బిలావల్
  • కశ్మీర్ అంశంలో ఐరాసలో చేసిన ప్రయత్నాలకు ఫలితం శూన్యమని వెల్లడి
  • ఉగ్రవాదంపై పోరుకు భారత్-పాక్ నిఘా సంస్థలు కలిసి పనిచేయాలని సూచన
  • గతంలో ఉగ్రవాద సంస్థలతో పాక్‌కు సంబంధాలున్నాయని అంగీకారం
  • అది ముగిసిన అధ్యాయమని, పాఠాలు నేర్చుకున్నామని వ్యాఖ్య
అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి ఎదురవుతున్న పరాజయాలను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీ స్వయంగా అంగీకరించారు. ముఖ్యంగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించేందుకు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఆయన వాపోయారు. అమెరికా పర్యటనలో ఉన్న బిలావల్, న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్‌పై ఏర్పాటైన భారత అఖిలపక్షం తరహాలోనే పాకిస్థాన్ కూడా బిలావల్ భుట్టో నేతృత్వంలో ఒక పార్లమెంట్ సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం అమెరికా పర్యటనలో భాగంగా.... ఐరాసలో ఆయన మాట్లాడుతూ, "కశ్మీర్‌ అంశానికి సంబంధించినంత వరకు మనం ఎదుర్కొంటున్న అడ్డంకులు ఇప్పటికీ ఉన్నాయి. దీంతోపాటు ఇతర వేదికలపైనా ఎదురుదెబ్బలు తగిలాయి" అని బిలావల్ పేర్కొన్నారు.

రెండు అణ్వస్త్ర దేశాలైన భారత్, పాకిస్థాన్‌ల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక వ్యవస్థను తీసుకురావడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఉగ్రవాదంపై పోరు విషయంలో ఆసక్తికరమైన సూచన చేశారు.

"మా రెండు దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఐఎస్‌ఐ (ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్), రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) కలిసి కూర్చొని, ఈ ఉగ్రవాద శక్తులపై పోరాటం కోసం కలిసి పనిచేస్తే, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గిపోతాయని నేను భావిస్తున్నాను" అని బిలావల్ అన్నారు. ఇరు దేశాల మధ్య నిరంతర ఘర్షణ వాతావరణం విద్రోహ శక్తులను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో కూడా బిలావల్ భుట్టో తన దేశానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌కు గతంలో సంబంధాలున్నాయనేది వాస్తవమేనని ఆయన ఇటీవల అంగీకరించారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ, "పాకిస్థాన్‌కు ఒక గతం ఉందనేది రహస్యం కాదని నేను భావిస్తున్నా. దాని ఫలితంగా మనం బాధపడ్డాం. పాకిస్థాన్ నష్టపోయింది. ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం. పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది. అయితే, అది ముగిసిన అధ్యాయం. అది మన చరిత్రలో ఒక దురదృష్టకరమైన భాగం" అని బిలావల్ పేర్కొన్నారు.
Bilawal Bhutto
Kashmir issue
Pakistan
United Nations
India
ISI
RAW
Terrorism

More Telugu News