P Vasu: ఎన్టీఆర్ లేకపోతే మాకు సొంత ఇల్లులేకుండా పోయేది: దర్శకుడు పి. వాసు!

- దర్శకుడిగా పి.వాసుకి మంచి పేరు
- తన తండ్రి గురించి ప్రస్తావించిన వాసు
- నిర్మాతగా ఆయన నష్టపోయారని వెల్లడి
- ఎన్టీఆర్ ఆదుకున్నారని వివరణ
దక్షిణాది సినిమాలను గురించి తెలిసినవారికి, దర్శకుడు పి.వాసు పేరు తెలియకుండా ఉండదు. 1980లలో ఎంట్రీ ఇచ్చిన ఆయన తమిళ .. కన్నడ .. తెలుగు భాషలలో అనేక చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ఆయన తండ్రి పీతాంబరన్, ఎన్టీఆర్ - ఎంజీఆర్ లకు మేకప్ మెన్ గా సుదీర్ఘ కాలంపాటు పనిచేశారు. తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాసు మాట్లాడారు.
" నాన్నగారు ఒక వైపున మేకప్ మెన్ గా పనిచేస్తూనే, మరోవైపున సినిమాలను నిర్మించేవారు. మా ఫాదర్ నిర్మించిన 'శ్రీ' అనే సినిమా వలన మాకు బాగా నష్టం వచ్చింది. దాంతో 6 నెలల గడువు చెప్పి, ఇల్లును తాకట్టు పెట్టవలసి వచ్చింది. డబ్బు కట్టకపోతే ఇల్లు లేకుండా పోతుంది. అది సెంటిమెంట్ కావడంతో నాన్నగారు టెన్షన్ పడుతున్నారు. ఈ విషయం ఎంజీఆర్ గారికి తెలిసింది. దాంతో ఆయన మా బ్యానర్లో సినిమా చేయడానికి డేట్స్ ఇచ్చారు. వచ్చిన డబ్బుతో ఇల్లు నిలబెట్టుకోమని చెప్పారు" అని అన్నారు.
" ఆ తరువాత ఎన్టీఆర్ గారు ఊరు నుంచి వచ్చారు. "మీకు .. మాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది కదా .. మాకు ఒక మాటైనా చెప్పకూడదా? ఎంజీఆర్ గారి కంటే ముందుగానే మీరు నాతో ఒక సినిమా చేసుకోండి .. నేను డేట్స్ ఇస్తాను" అంటూ వాళ్ల బ్రదర్ ను పిలిచి పీతంబరం గారికి డేట్స్ ఇవ్వమని చెప్పారు. అప్పుడు చేసిన సినిమానే 'అన్నదమ్ముల అనుబంధం'. ఎన్టీఆర్ లేకపోతే ఆ సినిమా లేదు .. ఆ సినిమా లేకపోతే మాకు సొంత ఇల్లు ఉండేది కాదు" అని చెప్పారు.