LR Eswari: కష్టాల్లో పుట్టాను .. కళనే నమ్ముకున్నాను: గాయని ఎల్ ఆర్ ఈశ్వరి!

- 1950లలో ఎంట్రీ ఇచ్చిన ఎల్ ఆర్ ఈశ్వరి
- గాయనిగా పరిచయం చేసిన కేవీ మహదేవన్
- విలక్షణమైన వాయిస్ తో సాధించిన ప్రత్యేకత
- తనని ఎవరూ ఎంకరేజ్ చేయలేదన్న ఎల్ ఆర్ ఈశ్వరి
ఒక వైపున సుశీల - జానకి తెలుగులో స్వరవిహారం చేస్తున్న సమయంలో, ఎల్ ఆర్ ఈశ్వరి తన స్వరాన్ని వినిపించారు. తన స్వరంలోని కొత్తదనాన్ని పరిచయం చేశారు. 1958లోనే ఆమెను గాయనిగా కేవీ మహదేవన్ పరిచయం చేసినప్పటికీ, 1960లలో వచ్చిన 'పాశమలార్' గాయనిగా ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె తెలుగులో విజయలలిత .. జ్యోతిలక్ష్మి .. జయమాలిని వంటివారికి ఎక్కువ పాటలు పాడారు.
తాజాగా 'పాప్ కార్న్' యూ ట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్ ఆర్ ఈశ్వరి మాట్లాడుతూ, " నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. అమ్మ .. నేను .. తమ్ముడు .. అంతే. అమ్మ కోరస్ పాడుతూ ఉండేది. అందువలన నాకు తెలియకుండానే పాటల పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. డబ్బు లేకపోవడం వలన నేను చదువుకోలేకపోయాను. ఆర్ధిక పరమైన ఇబ్బందులతోనే పెరిగాను" అని అన్నారు.
"సినిమాలలో నా మొదటిపాట పాడే సమయానికి నా వయసు 17. ఎన్టీ రామారావుగారి సినిమాలలో ఎక్కువ పాటలు పాడాను. రిహార్సల్స్ సమయంలో రామారావుగారు వచ్చేవారు. ఆయన నా వాయిస్ ను మెచ్చుకోవడం నా అదృష్టంగా భావించాను. గాయనిగా నా వాయిస్ పై నేను నిలబడుతూ వచ్చానే తప్ప, నన్ను ప్రత్యేకంగా ఎంకరేజ్ చేసినవాళ్లంటూ ఎవరూ లేరు. ఐదు భాషలలో గాయనిగా నాకు మంచి పేరుంది. అదే నాకు ఎంతో సంతృప్తిని ఇస్తూ ఉంటుంది" అని చెప్పారు.