Kamal Haasan: క్షమాపణలు చెప్పని కమల్ హాసన్.. కర్ణాటకలో 'థగ్ లైఫ్' సినిమా విడుదల ఆపేస్తున్నట్లు వెల్లడి

- కర్ణాటకలో 'థగ్ లైఫ్' సినిమా విడుదల ప్రస్తుతానికి నిలిపివేత
- కన్నడ భాషపై కమల్ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం
- సినిమాను నిషేధించాలని కేఎఫ్‌సీసీ హైకోర్టులో పిటిషన్
- క్షమాపణ చెప్పాలని కమల్‌కు హైకోర్టు సూచన
- కేఎఫ్‌సీసీకి కమల్ లేఖ, క్షమాపణ చెప్పని కమల్
- తదుపరి విచారణ జూన్ 10కి వాయిదా
కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' చిత్రం ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల కావడం లేదని ఆయన తరఫు న్యాయవాది మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలియజేశారు. 'థగ్ లైఫ్' సినిమా ప్రచార కార్యక్రమంలో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. థగ్ లైఫ్ ఈ నెల 5న విడుదల కానున్న నేపథ్యంలో, సినిమాను కర్ణాటకలో నిషేధించాలంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) హైకోర్టును ఆశ్రయించింది.
మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, కమల్ హాసన్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పి ఉంటే ఈ వివాదం ఇంత దూరం వచ్చేది కాదని అభిప్రాయపడింది. విచారణ అనంతరం, కమల్ హాసన్ కేఎఫ్‌సీసీకి ఒక లేఖ రాశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. అయితే, ఆ లేఖలో ఎక్కడా క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం.
మరోసారి పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, కమల్ రాసిన లేఖను ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. దీనిపై జస్టిస్ నాగప్రసన్న స్పందిస్తూ, కమల్ ఇచ్చిన వివరణ బాగానే ఉన్నా, అందులో ఒక ముఖ్యమైన వాక్యం లోపించిందని వ్యాఖ్యానించారు. కమల్ వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని, ఆయన ఒక వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని, కన్నడ భాషను కించపరిచే ఉద్దేశం లేదని కమల్ తరఫు న్యాయవాది వాదించారు. అలాంటప్పుడు క్షమాపణ చెప్పి వివాదాన్ని ముగించవచ్చు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది.
దీనికి కమల్ న్యాయవాది బదులిస్తూ, "కమల్ హాసన్ తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే, కర్ణాటకలో తన సినిమాను విడుదల చేయరు" అని కోర్టుకు విన్నవించారు. మరోవైపు, కేఎఫ్‌సీసీతో సంప్రదింపులు జరిపేందుకు కొంత సమయం కావాలని నిర్మాత తరఫు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.