Bhagwant Mann: ఇదేమైనా 'ఒకే దేశం - ఒకే భర్త' పథకమా?: ఆపరేషన్ సిందూర్‌పై భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్య

Bhagwant Mann Slams BJP Operation Sindoor
  • బీజేపీ 'సిందూర్'ను జోక్‌గా మార్చిందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విమర్శ
  • "ఇది 'ఒకే దేశం, ఒకే భర్త' పథకమా?" అంటూ మోదీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు
  • ఆపరేషన్ సిందూర్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని ఆరోపణ
  • ఇంటింటికీ సిందూర్ పంపుతున్నారన్న వార్తలను ఖండించిన పీఐబీ
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ 'సిందూర్' అంశాన్ని ఒక జోక్‌గా మార్చిందని ఆయన విమర్శించారు. "ఇదేమైనా 'ఒకే దేశం, ఒకే భర్త' పథకమా?" అంటూ ఆయన బీజేపీని ప్రశ్నించారు. లూథియానా ఉప ఎన్నికల నేపథ్యంలో "ఆపరేషన్ సిందూర్" పేరుతో బీజేపీ కార్యకర్తలు ఓట్లు అడుగుతున్నారన్న ప్రశ్నకు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"బీజేపీ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఓట్లు అడుగుతోంది. ఈ వ్యక్తులు 'సిందూర్'ను ఒక జోక్‌గా మార్చేశారు. ప్రతీ ఇంటికీ సిందూర్ పంపుతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో సిందూర్ రాసుకుంటారా? ఇది 'ఒకే దేశం, ఒకే భర్త' పథకమా?" అని భగవంత్ మాన్ ప్రశ్నించారు.

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో, భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ ఘనతను చాటిచెప్పేందుకు బీజేపీ దేశవ్యాప్త ప్రచారం చేపడుతుందని ఇటీవల ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన అనంతరం, ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రతి ఇంటికీ సిందూర్ పంపుతుందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది.

గతంలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా భారత సైన్యం చర్యకు 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టడాన్ని తప్పుబట్టారు. "ఆపరేషన్ సిందూర్ అనే పేరు వారి మెదడులో పుట్టిందే. ఇది రాజకీయ ప్రేరేపితం. వివిధ దేశాల్లో బహుళ పార్టీల ప్రతినిధులు పర్యటించి భారతదేశ వైఖరిని వివరిస్తున్న తరుణంలో నేను ఈ విషయం చెప్పాలనుకోలేదు. కానీ ఈరోజు, ప్రధానమంత్రి రాజకీయ ప్రచారం కోసమే పశ్చిమ బెంగాల్‌కు వచ్చారు" అని ప్రధాని బెంగాల్ పర్యటన అనంతరం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. "మొదట, ప్రధాని మోదీ తనను తాను చాయ్‌వాలాగా అభివర్ణించుకున్నారు. తర్వాత, కాపలాదారుగా చెప్పుకున్నారు. ఇప్పుడు సిందూర్ అమ్మడానికి ఇక్కడికి వచ్చారు" అని ఆమె విమర్శించారు.
Bhagwant Mann
Punjab CM
Aam Aadmi Party
Operation Sindoor
BJP

More Telugu News