Gajana Movie: అడవిలో సాగే అడ్వెంచర్ .. హాట్ స్టార్ లో!

- తమిళంలో నిర్మితమైన 'గజాన'
- పధానమైన పాత్రను పోషించిన వేదిక
- అడవి నేపథ్యంలో సాగే కథ
- పిల్లలను ఆకట్టుకునే కంటెంట్
తమిళంలో ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా 'గజాన' రూపొందింది. ప్రభాదీష్ సామ్జ్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది. అచ్చు రాజమణి సంగీతాన్ని అందించిన ఈ సినిమా, మే 9వ తేదీన థియేటర్లలో విడుదలైంది. 'వేదిక' ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ వైపు నుంచి చాలా తక్కువ వసూళ్లు రాబట్టినప్పటికీ, ఓటీటీలో పిల్లలు ఎక్కువగా చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కాకపోతే 'సీజీ' విషయంలో శ్రద్ధ పెట్టవలసిందనే టాక్ ఇక్కడ కూడా వినిపిస్తూనే ఉంది.
కథలోకి వెళితే .. అది 'నాగమలై' అనే ఫారెస్టు ఏరియా. దట్టమైన ఆ అడవిలోకి వెళ్లిన వాళ్లెవరూ తిరిగిరాలేదు. అలాగని ఆ అడవిలోని 'నిధి'ని సొంతం చేసుకోవాలనే ఆశతో వచ్చేవారి సంఖ్య తగ్గలేదు. ఆ అడవిలో ఒక పరిధి దాటిన తరువాత, అక్కడి నుంచి మిగతా ప్రాంతం 'యాలి' రక్షణలో ఉంటుందని అక్కడివారు నమ్ముతుంటారు. యాలి అనేది ఏనుగు .. సింహం కలిసిన ఒక చిత్రమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. అలాంటి అడవిలోకి ఒక బ్యాచ్ అడుగుపెడుతుంది.
వేదిక 'నాగమలై' అడవీ ప్రాంతాన్ని గురించి తెలుసుకుంటుంది. ఆ అడవీ ఒక మాయా వనమనీ, అనేక అతీంద్రియ శక్తులకు నిలయమని ఆమెకి కొన్ని పుస్తకాల వలన అర్థమవుతుంది. అలాంటి ఆమె ఆ అడవిలోకి అడుగుపెడుతుంది. నాగమలై అడవిలో ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆమె వాటిని ఎలా ఎదుర్కొంటుంది? అడవిలోని నిధిని దక్కించుకోవాలనే వారి ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.