తండ్రి కాబోతున్న సినీ నటుడు మహేశ్ విట్టా

  • తన భార్య గర్భవతి అని వెల్లడించిన మహేశ్ విట్టా
  • భార్య బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను షేర్ చేసిన మహేశ్
  • నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
సినీ నటుడు మహేశ్ విట్టా ఇప్పుడు తన జీవితంలో మరో మధురమైన ఘట్టంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన అర్ధాంగి శ్రావణి రెడ్డి నిండు గర్భిణిగా ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు మహేశ్ విట్టా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మహేశ్ విట్టా తన కెరీర్‌ను 'ఫన్ బకెట్' వీడియోలతో ప్రారంభించి, ఆ తర్వాత 'బిగ్‌బాస్' షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ షోలో రెండుసార్లు పాల్గొని, కొన్ని వారాల పాటు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. 'బిగ్‌బాస్' షోతో వచ్చిన గుర్తింపుతో 'కృష్ణార్జున యుద్ధం', 'కొండపొలం' వంటి పలు చిత్రాల్లో హాస్యనటుడిగా అవకాశాలు దక్కించుకున్నారు. నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

వ్యక్తిగత జీవితానికి వస్తే, మహేశ్ విట్టా, శ్రావణి రెడ్డి ఐదేళ్ల పాటు ప్రేమించుకుని... పెద్దల అంగీకారంతో 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు ఈ దంపతులు తమ మొదటి బిడ్డ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


More Telugu News