B. Acharao: టీటీడీలో కలకలం.. వైసీపీ నేత నిరసన వెనుక ఉద్యోగి హస్తం?

- తిరుమల క్యూలైన్‌లో వైసీపీ నేత అచ్చారావు నిరసన
- టీటీడీ చైర్మన్, అధికారులే లక్ష్యంగా ఆరోపణలు
- వీడియో తీసి వైరల్ చేసిన టీటీడీ ఉద్యోగి!
- అదుపులోకి తీసుకుని విజిలెన్స్ విచారణ
- క్షమాపణ చెప్పిన అచ్చారావుపై పోలీసుల బైండోవర్ కేసు
- భూమన వ్యాఖ్యల నేపథ్యంలో ఘటనకు ప్రాధాన్యం
తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కాకినాడకు చెందిన వైసీపీ నాయకుడు బి. అచ్చారావు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్, ఇతర అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనను వీడియో తీసి, సోషల్ మీడియాలో వైరల్ చేసింది టీటీడీ ఉద్యోగేనని తేలింది.
వివరాల్లోకి వెళితే.. టీటీడీ ఆరోగ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న సదరు ఉద్యోగి.. అచ్చారావు నిరసనను ప్రోత్సహించడమే కాకుండా, ఆ దృశ్యాలను తన ఫోన్‌లో చిత్రీకరించి, వైసీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేయించినట్టు విజిలెన్స్ విభాగం ప్రాథమికంగా గుర్తించింది. ఈ సమాచారం ఆధారంగా, విజిలెన్స్ అధికారులు ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఇటీవల వైసీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. టీటీడీలో తమ పార్టీకి చెందిన సుమారు రెండు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు టీటీడీ పరిపాలన వ్యవస్థ విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగి ఒకరు సంస్థకు వ్యతిరేకంగా జరిగిన నిరసనను ప్రోత్సహించి, దానిని ప్రచారం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దిశగా నిఘా వర్గాలు, పోలీసు విభాగం లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
మరోవైపు, దేవస్థానం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు.. తాను ఆ సమయంలో ఆవేశంలో విచక్షణ కోల్పోయి అలాంటి వ్యాఖ్యలు చేశానని, తన పొరపాటును మన్నించాలని టీటీడీ అధికారులను క్షమాపణ కోరారు. అయినప్పటికీ, రాజకీయ దురుద్దేశంతో వివాదాన్ని రాజేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై బైండోవర్ కేసు నమోదు చేశారు.