Kavali Grishma: గొడ్డలిపోటు దినం.. చెల్లిని గెంటేసిన దినం ఎప్పుడు?: టీడీపీ ఎమ్మెల్సీ గ్రీష్మ

- జూన్ 4ను వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రకటించడంపై ఎమ్మెల్సీ గ్రీష్మ ఆగ్రహం
- గొడ్డలిపోటు, కుటుంబ సభ్యులను దూరం చేసిన దినాలు ఎప్పుడో చెప్పాలని డిమాండ్
- వైసీపీ కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ తరహా ప్రకటనలని ఆరోపణ
- ఎన్నికల్లో ఓడినా జగన్‌కు, వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని వ్యాఖ్య
జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా ప్రకటించిన వైసీపీ నాయకులపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు తమ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, కుంభకోణాలు, విధ్వంసకర కార్యకలాపాలను ప్రజలకు గుర్తుచేస్తూ ‘గొడ్డలిపోటు దినం’, ‘సొంత చెల్లిని, తల్లిని గెంటేసిన దినం’, ‘అమ్మ మీద కేసు పెట్టిన దినం’ వంటివి ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ నరకాసుర పాలన నుంచి విముక్తి కోరుతూ ఓటు వేసి తీర్పు ఇచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా ఎలా ప్రకటిస్తారని గ్రీష్మ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జనరంజకంగా సాగుతున్న కూటమి పాలనను చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి తిరస్కరించినప్పటికీ, వైసీపీ అధినేత జగన్‌కు, ఆ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని గ్రీష్మ ధ్వజమెత్తారు. "మద్య నిషేధం అంటూ బూటకపు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక, కల్తీ మద్యంతో వేలాది మంది మహిళల పసుపుకుంకాలు దూరం చేసి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా?" అని జగన్‌ను నిలదీశారు. అలాగే, సీపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, వారికి వెన్నుపోటు పొడిచింది కూడా మీరే కదా అని గ్రీష్మ ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇలాంటి చర్యలతో వైసీపీ మరింత అప్రతిష్ఠపాలు కావడం ఖాయమని ఆమె వ్యాఖ్యానించారు.