Shreyas Iyer: ఐపీఎల్ హిస్టరీలో అయ్యర్ అరుదైన ఘనత

- క్వాలిఫయర్-2లో ఎంఐను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన పీబీకేఎస్
- మూడు వేర్వేరు జట్లకు కెప్టెన్‌గా ఫైనల్‌కు చేర్చిన ఏకైక ఆటగాడిగా అయ్యర్
- కెప్టెన్ ఇన్నింగ్స్ (87 నాటౌట్)తో పంజాబ్ విజయంలో కీరోల్
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ముంబయి ఇండియన్స్ (ఎంఐ)ను చిత్తు చేసి, ఫైనల్‌కు చేరింది. దీంతో పంజాబ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చేసింది. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్ ఫైనల్‌లోకి ఆ జట్టు మరోసారి అడుగుపెట్టింది. ఈ విజయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ (87 నాటౌట్)తో కీలక పాత్ర పోషించాడు. చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అయ్యర్ అరుదైన ఘనత
ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ హిస్టరీలోనే ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు మూడు వేర్వేరు జట్లకు కెప్టెన్‌గా ఫైనల్‌కు చేర్చిన ఏకైక ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కు, 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు నాయకత్వం వహించిన శ్రేయస్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌ను టైటిల్ పోరుకు తీసుకొచ్చాడు. మెగా వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి, తనపై పంజాబ్ యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని శ్రేయస్ నిలబెట్టుకున్నాడు. న్యాయం చేసినట్లు ఈ విజయంతో స్పష్టమైంది.
భారీ లక్ష్యఛేదనలో అదే కీలకం: అయ్యర్
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్, భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో ప్రశాంతంగా ఉండటం కీలకమని అన్నాడు. మొదట క్రీజ్‌లో స్థిరపడేందుకు కొంత సమయం తీసుకున్నానని, అదే సమయంలో సహచర బ్యాటర్లు స్కోరు బోర్డును పరిగెత్తించడం కలిసొచ్చిందని తెలిపాడు. క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్‌తో ఓడినా... ఆ పరాజయాన్ని తాము మరిచిపోయామని, ఒకే ఒక్క మ్యాచ్‌తో జట్టును అంచనా వేయలేమని పేర్కొన్నాడు.
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రికార్డులు ఇలా
2019: ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేఆఫ్స్)
2020: ఢిల్లీ క్యాపిటల్స్ (ఫైనల్)
2022: కోల్‌కతా నైట్ రైడర్స్ (7వ స్థానం)
2024: కోల్‌కతా నైట్ రైడర్స్ (ఛాంపియన్)
2025: పంజాబ్ కింగ్స్ (ఫైనల్)