Rajendra Prasad: మరోసారి చర్చనీయాంశంగా రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు... ఈసారి అలీపై!

- ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో నటుడు రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆలీని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలం వాడారన్న ఆరోపణ
- చప్పట్లు కొట్టలేదని ప్రేక్షకులపై కూడా అసహనం వ్యక్తం చేసిన వైనం
- రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్, నెటిజన్ల తీవ్ర విమర్శలు
- గతంలోనూ ఇలాంటి ఘటనలు, 'రాబిన్ హుడ్' సినిమా సమయంలోనూ వివాదం
ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా సహనటుడు ఆలీని ఉద్దేశించి వాడిన పదజాలం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రాజేంద్రప్రసాద్, మైక్ అందుకుని ప్రసంగిస్తున్న సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. "మీరందరూ వస్తున్నారని నాకు చెప్పలేదు, రాకుంటే నేను మిస్ అయ్యే వాడిని. ఏరా అచ్చన్న (నిర్మాత అచ్చిరెడ్డి)... బయటికి రా నీ సంగతి చూస్తా" అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. ఆ తర్వాత, "మా ఇద్దరికీ ఇది అలవాటే" అని చెబుతూ, "ఇక ఆలీగాడు ఎక్కడ ఉన్నాడు లం*కొడుకు.. ఇదంతా మనకు కామనే" అంటూ ఆలీని ఉద్దేశించి తీవ్రమైన పదజాలం వాడినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
అంతటితో ఆగకుండా, రాజేంద్రప్రసాద్ సభలోని ప్రేక్షకులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. తాను అంతకుముందు రోజు ఎన్టీఆర్ అవార్డు అందుకున్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో, "ఏంటి మీరు చప్పట్లు కొట్టరా?" అని ప్రశ్నించి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. అక్కడున్న వారిని ఉద్దేశించి, "మీ అందరికీ బ్రెయిన్ పోయిందా?" అని, చప్పట్లు కొట్టకపోతే "సిగ్గు లేనట్టే" అంటూ మరికొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్రప్రసాద్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నటుడై ఉండి, బహిరంగ వేదికపై ఇలాంటి భాష వాడటం సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు. గతంలో కూడా రాజేంద్రప్రసాద్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారని గుర్తుచేస్తున్నారు. నితిన్ నటించిన 'రాబిన్ హుడ్' చిత్ర ప్రచారంలో భాగంగా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను దూషించి, ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన ఉదంతాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఆలీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.