YS Sharmila: జగన్, లోకేశ్ మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది: షర్మిల

- పదో తరగతి రీకౌంటింగ్‌పై జగన్, లోకేశ్ వాదనలు హాస్యాస్పదమన్న షర్మిల
- వైసీపీ హయాంలో రీకౌంటింగ్‌లో 20% మందికి అదనపు మార్కులు
- కూటమి ప్రభుత్వంలో 30 వేల దరఖాస్తులకు 11 వేల మందికి ఫస్ట్ క్లాస్
- ఇది ప్రభుత్వాల వైఫల్యమేనన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్
- అన్ని పేపర్లు ఉచితంగా రీవెరిఫికేషన్ చేయాలని డిమాండ్
పదో తరగతి పరీక్ష ఫలితాల రీకౌంటింగ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మధ్య జరుగుతున్న వాదనలు "దెయ్యాలు వేదాలు వల్లించినట్లు" ఉన్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యావ్యవస్థను గత, ప్రస్తుత ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
"వైసీపీ పాలనలో ప్రతి సంవత్సరం రీకౌంటింగ్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో దాదాపు 20 శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయ్యేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 30 వేల మంది విద్యార్థుల్లో ఏకంగా 11 వేల మందికి ఫస్ట్ క్లాస్ మార్కులు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్నిబట్టి పేపర్ల మూల్యాంకనంలో ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో అర్థం చేసుకోవచ్చు. ఫలితాల్లో పారదర్శకత కొరవడిందని స్పష్టమవుతోంది. విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేశారనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి అవసరం లేదు" అని షర్మిల విమర్శించారు.
గత పదేళ్లుగా రాష్ట్రంలో విద్యార్థులు కాదు, ప్రభుత్వాలే ఫెయిల్ అవుతున్నాయని షర్మిల దుయ్యబట్టారు. "వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు. పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ, కూటమి ప్రభుత్వాలే రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఫెయిల్ అవుతున్నాయి. పిల్లల భవిష్యత్తును నిర్ణయించడంలో విఫలమైన వీళ్లు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారు? చదువులతో చెలగాటం ఆడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ధనదాహం మీద ఉన్న శ్రద్ధ విద్యావ్యవస్థను బాగుచేయడం మీద వీరికి లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"30 వేల మంది విద్యార్థులకు సంబంధించి 60 వేల పేపర్లకు రీకౌంటింగ్ దరఖాస్తులు వస్తే, అందులో 11 వేల మందికి అత్యున్నత మార్కులు రావడం పూర్తిగా మీ ప్రభుత్వ వైఫల్యమే. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు విఫలమైనట్లే. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలి. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి పేపర్‌ను ఉచితంగా రీవెరిఫికేషన్ చేయాలి" అని షర్మిల డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని ఆమె స్పష్టం చేశారు.