Lawrence Campbell: మాజీ ప్రియుడి లాటరీ సొమ్ము కాజేసి తాజా ప్రియుడితో యువతి పరార్

- రూ.30 కోట్లు మోసపోయానంటూ కోర్టుకెక్కిన ప్రియుడు.. కెనడాలో వింత ఘటన
- గుర్తింపు కార్డు లేకపోవడంతో ప్రియురాలి పేరుపై లాటరీ క్లెయిమ్
- కొద్ది రోజులకే డబ్బుతో పాటు ప్రియురాలు అదృశ్యం
కెనడాలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది.. లాటరీలో రూ.30 కోట్లు గెల్చుకున్నాడు. అయితే, సరైన గుర్తింపు కార్డు లేకపోవడంతో తన మాజీ ప్రియురాలి పేరుతో లాటరీ క్లెయిం చేశాడు. ఆ సొమ్ము చేతిలో పడ్డాక మాజీ ప్రియురాలు హ్యాండిచ్చింది. తన ప్రియుడితో కలిసి సొమ్ము తీసుకుని పారిపోయింది. దీంతో తన డబ్బు తనకు ఇప్పించాలంటూ మాజీ ప్రియుడు కోర్టుకెక్కాడు.
వివరాల్లోకి వెళితే.. విన్నిపెగ్‌కు చెందిన లారెన్స్ క్యాంప్‌బెల్ అనే వ్యక్తి, తాను 2024లో కొన్న లాటరీ టికెట్‌కు 5 మిలియన్ల కెనడియన్ డాలర్లు (సుమారు 30 కోట్ల రూపాయలు) తగిలిందని, అయితే తన వద్ద సరైన గుర్తింపు కార్డు లేకపోవడంతో ఆ డబ్బును అప్పటి తన ప్రియురాలు క్రిస్టల్ ఆన్ మెక్‌కే పేరు మీద క్లెయిమ్ చేయమని కోరినట్లు తెలిపాడు.
తనకు బ్యాంకు ఖాతా కూడా లేకపోవడంతో, వెస్టర్న్ కెనడా లాటరీ కార్పొరేషన్ అధికారుల సలహా మేరకు మెక్‌కే పేరు మీదే డబ్బు జమ చేయడానికి అంగీకరించాడు. వీరిద్దరూ ఏడాదిన్నరకు పైగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, కలిసి జీవిస్తున్నామనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నానని క్యాంప్‌బెల్ చెప్పాడు. లాటరీ గెలిచిన తర్వాత ఇద్దరూ కలిసి ఓ షాపర్స్ డ్రగ్ మార్ట్‌లో వీడియో కూడా తీసుకున్నారు.
ప్రచార ఫోటోలలో మెక్‌కే పెద్దగా సంతోషంగా కనిపించకపోయినా, ఈ గెలుపును క్యాంప్‌బెల్ తన ప్రియురాలికి ఇచ్చిన పుట్టినరోజు కానుకగా అప్పట్లో ప్రచారం చేశారు. "మూడు వారాలుగా ఆమె నన్ను టికెట్ కొనమని అడుగుతోంది, కానీ నేను కొనలేదు. తర్వాత ఓ దుకాణం దగ్గర ఆగినప్పుడు, సరే నీకోసం ఇప్పుడే కొంటానని చెప్పి కొన్నాను" అని క్యాంప్‌బెల్ గుర్తుచేసుకున్నాడు.
ఆ తర్వాత కొద్ది రోజులకే మెక్‌కే అదృశ్యమైందని, తాము ఉంటున్న హోటల్ గదికి తిరిగి రాలేదని, అన్ని రకాల కాంటాక్ట్‌లు కట్ చేసిందని క్యాంప్‌బెల్ ఆరోపించాడు. చివరకు ఆమెను మరో వ్యక్తితో బెడ్ మీద చూశానని దావాలో పేర్కొన్నాడు. మరొకరి పేరుపై లాటరీ క్లెయిమ్ చేయాలంటూ తప్పుడు సలహా ఇచ్చారంటూ లాటరీ కంపెనీని కూడా క్యాంప్ బెల్ కోర్టుకీడ్చాడు. ఈ కేసు వ్యవస్థాగత లోపంతో పాటు, విధి ఆడిన వింత నాటకం వంటిదని క్యాంప్‌బెల్ న్యాయవాది వ్యాఖ్యానించారు. అయితే, క్యాంప్‌బెల్ ఆరోపణలను ఆయన మాజీ ప్రియురాలు మెక్‌కే ఖండించిందని ఆమె తరపున వాదిస్తున్న న్యాయవాది పేర్కొన్నారు.