Harish Kumar Gupta: పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తా

Harish Kumar Gupta Takes Charge as Full Time DGP of Andhra Pradesh
  • నాలుగు నెలలుగా ఇన్ చార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్ కుమార్ గుప్తా
  • 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి
  • పదవీ విరమణతో సంబంధం లేకుండా రెండేళ్ల పాటు డీజీపీగా బాధ్యతలు నిర్వహించనున్న హరీశ్ కుమార్ గుప్తా
ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పోలీస్ దళాధిపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హరీశ్ కుమార్ గుప్తా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ పోస్టులో కొనసాగుతూ ఇన్‌ఛార్జి డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తా పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి డీజీపీగా రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. గత నాలుగు నెలలుగా ఇన్ ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పోలీసుశాఖలో తనదైన ముద్ర వేశారు.

ఈ ఏడాది జనవరిలో ద్వారకా తిరుమలరావు డీజీపీగా పదవీ విరమణ చేసిన తర్వాత హరీశ్ కుమార్ గుప్తాకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇన్‌ఛార్జిగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తాను పలువురు సీనియర్ పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, సార్వత్రిక ఎన్నికల సమయంలో గత ఏడాది మే 6న హరీశ్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. గత ఏడాది జూన్ 19 వరకు ఆ పోస్టులో కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియారిటీ ప్రాతిపదికన మొదట ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. 
Harish Kumar Gupta
Andhra Pradesh DGP
AP Police
Director General of Police
IPS officer
Vigilance and Enforcement
Dwaraka Tirumala Rao
AP Elections

More Telugu News