MJ Akbar: పాకిస్థాన్ ఒక విష సర్పం.. అబద్ధాలతో కాలం గడుపుతోంది: ఎంజే అక్బర్ తీవ్ర ఆగ్రహం

- పాకిస్థాన్‌పై మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తీవ్ర విమర్శలు
- అబద్ధాలు, కపటనీతి ఉన్న దేశంతో చర్చలు కష్టమంటూ వ్యాఖ్య
- పీఓకేను తిరిగి తీసుకోవడంపైనే చర్చలని స్పష్టం
- కోపెన్‌హాగన్‌లో ప్రవాస భారతీయుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు
విదేశాంగ శాఖ మాజీ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశాన్ని ఒక విషసర్పంతో పోలుస్తూ, అబద్ధాలతో కాలం గడిపే, కపటనీతి కలిగిన పాక్‌తో చర్చలు జరపడం దాదాపు అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కోపెన్‌హాగన్‌లో ప్రవాస భారతీయులతో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ పాకిస్థాన్ విషయంలో భారత్ వైఖరిని ఆయన గట్టిగా సమర్థించారు.
ప్రస్తుతం బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని విపక్ష బృందంతో పాటు విదేశాల్లో పర్యటిస్తున్న ఎంజే అక్బర్.. పాకిస్థాన్‌తో చర్చల ప్రస్తావనపై కీలక వ్యాఖ్యలు చేశారు. "కొంతమంది మిత్రులు పాకిస్థాన్‌తో భారత్ ఎందుకు చర్చలు జరపడం లేదని అడుగుతున్నారు. అసలు అక్కడ ఎవరితో చర్చలు జరపాలి? చిత్తశుద్ధి లేని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోని ప్రభుత్వం అక్కడ ఉంది. విషపు నాలుక కలిగిన ఆ ప్రభుత్వంతో మాట్లాడటం వల్ల ఎవరికి నష్టం?" అని అక్బర్ ప్రశ్నించారు. సర్పం ఎన్నడూ తన విషంతో తాను చనిపోదని, దాని విషం ఇతరులకే హాని చేస్తుందని ఆయన చురక అంటించారు.
దేశంలో దీర్ఘకాలంగా నెలకొన్న అశాంతికి పాకిస్థానే ప్రధాన కారణమని ఎంజే అక్బర్ ఆరోపించారు. కేవలం సాకులుగా మారిన అంశాలపై చర్చల పేరుతో భారత్ తన విలువైన సమయాన్ని వృథా చేసుకోబోదని తేల్చిచెప్పారు. చర్చల కోసం కేటాయించే సమయాన్ని కూడా పాకిస్థాన్ మరో ఉగ్రదాడికి ప్రణాళిక రచించుకోవడానికి వాడుకుంటుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ నోట వెలువడే చర్చల మాట కేవలం బూటకమని, అందులో ఎలాంటి నిజాయతీ లేదని అక్బర్ అన్నారు. అంతేకాకుండా, ఒకవేళ చర్చలు జరపాల్సి వస్తే, అవి కేవలం పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకునే అంశంపైనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అంతకుమించి వేరే అంశాలపై చర్చలకు ఆస్కారం లేదని అన్నారు.