Narendra Modi: ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులతో పాటు వారూ భారీ మూల్యం చెల్లించుకున్నారు: నరేంద్ర మోదీ

Narendra Modi says terrorists paid heavily in Operation Sindoor
  • పహల్గామ్ దాడికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్‌'
  • భారత నారీశక్తిని సవాల్ చేసి ఉగ్రవాదులు వినాశనం కొనితెచ్చుకున్నారన్న ప్రధాని
  • ఉగ్రవాదులను పోషించేవారికీ భారీ మూల్యం తప్పదని ప్రధాని హెచ్చరిక
  • రాణి అహల్యాబాయి 300వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం
పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌'లో భారత నారీశక్తి కీలక పాత్ర పోషించిందని, ఈ చర్య ద్వారా ఉగ్రవాదులు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఆపరేషన్‌లో పలువురు మహిళా అధికారులు పాల్గొని ఉగ్రవాదుల ఆచూకీని గల్లంతు చేశారని ఆయన ప్రశంసించారు. రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా శనివారం భోపాల్‌లో నిర్వహించిన ‘మహిళా స్వశక్తికరణ్ మహా సమ్మేళన్‌’లో ప్రధాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఆపరేషన్ సిందూర్‌' ద్వారా ఉగ్రవాదులే కాకుండా, వారిని పోషించేవారు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత్ ప్రపంచానికి స్పష్టం చేసిందని ప్రధాని పేర్కొన్నారు. ఆ సమయంలో భారతీయ మహిళల శక్తిసామర్థ్యాలను ప్రపంచమంతా చూసిందని ఆయన గుర్తుచేశారు. 'ఆపరేషన్ సిందూర్‌' అనంతరం, భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ దాడులు జరిపినప్పుడు, అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలోని బీఎస్‌ఎఫ్ మహిళా బృందం అఖ్నూర్‌లోని ఫార్వర్డ్ పోస్టుల వద్ద మూడు రోజుల పాటు వీరోచితంగా పోరాడిందని ప్రధాని కొనియాడారు.

‘‘మన సంప్రదాయంలో 'సిందూర్‌' 'నారీశక్తి'కి చిహ్నం. పహల్గామ్‌లో, ఉగ్రవాదులు కేవలం మన పౌరుల రక్తం మాత్రమే చూడలేదు, మన సంస్కృతిపై దాడి చేశారు. మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు. ఉగ్రవాదులు భారత నారీశక్తికి విసిరిన సవాలే వారి పాలిట, వారిని పోషిస్తున్న వారి పాలిట శాపంగా మారింది. పాకిస్థాన్‌ సైన్యం కూడా ఊహించని ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలపై మన సాయుధ దళాలు దాడులు చేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం చేపట్టిన ఈ ఆపరేషన్‌ భారత చరిత్రలోనే అతిపెద్ద విజయం’’ అని వ్యాఖ్యానించారు.
Narendra Modi
Operation Sindoor
Indian Army
Pahalgam attack
terrorism

More Telugu News