Donald Trump: హార్వర్డ్ వర్సిటీపై ట్రంప్ కోపానికి కారణం ఏంటంటే..!

Donald Trump Harvard University Conflict Explained
  • కీలక విషయం వెల్లడించిన ట్రంప్ ఆత్మకథ రచయిత
  • గతంలో ట్రంప్‌ను హార్వర్డ్ తిరస్కరించిందని వెల్లడి
  • హార్వర్డ్‌కు నిధులు, విదేశీ విద్యార్థులపై ట్రంప్ కఠిన ఆంక్షలు
  • ఈ ఆరోపణలను ఖండించిన వైట్‌హౌస్.. ఇదంతా తప్పుడు ప్రచారమని వివరణ
ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీ నిధుల్లో కోత విధించడంతో పాటు విద్యార్థుల ప్రవేశాలపైనా ట్రంప్ పలు ఆంక్షలు విధించారు. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీని ట్రంప్ టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ట్రంప్ మాత్రం క్యాంపస్‌లలో యూదు వ్యతిరేకతను (యాంటీసెమిటిజం) నిర్మూలించడమే తన లక్ష్యమని చెబుతున్నారు. అయితే, దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని ట్రంప్ ఆత్మకథ రాసిన రచయిత మైఖేల్ వోల్ఫ్ తాజాగా బయటపెట్టారు. 

మైఖేల్ వోల్ఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ గతంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా వర్సిటీ ఆయనను తిరస్కరించిందని చెప్పారు. అందుకే హార్వర్డ్ పై ట్రంప్ పగ పెంచుకున్నారని "ది డైలీ బీస్ట్" పాడ్‌కాస్ట్‌లో వోల్ఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ట్రంప్ దరఖాస్తుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవు. మరోవైపు, ఇదంతా "ట్రంప్ షో"లో భాగమని, శత్రువులను సృష్టించుకుని, సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండటం ట్రంప్‌కు అలవాటని వోల్ఫ్ విశ్లేషించారు. "గొప్ప శత్రువులను ఎంచుకోవడం ద్వారా ట్రంప్ తన షోను రక్తి కట్టిస్తారు. హార్వర్డ్ ఆయన దృష్టిలో అలాంటి శత్రువే. నాటకీయతను ఇష్టపడే ట్రంప్, వార్తల్లో ప్రముఖంగా నిలవాలనే తన లక్ష్యాన్ని చేరుకున్నారు" అని వోల్ఫ్ వివరించారు.

ట్రంప్, హార్వర్డ్ వివాదంపై జరుగుతున్న ప్రచారాన్ని వైట్‌హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ తీవ్రంగా ఖండించారు. వోల్ఫ్, "ది డైలీ బీస్ట్" తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని, హార్వర్డ్ వంటి "అతిగా అంచనా వేయబడిన, అవినీతిమయమైన" సంస్థలో చేరాల్సిన అవసరం ట్రంప్‌కు లేదని అన్నారు. ట్రంప్ విజయవంతమైన వ్యాపారవేత్తగా, చరిత్రలో నిలిచిపోయే అధ్యక్షుడిగా ఎదిగారని రోజర్స్ పేర్కొన్నారు.

ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే హార్వర్డ్‌కు అందే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. గతవారం, విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని షరతులకు అంగీకరిస్తే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పినప్పటికీ, హార్వర్డ్ అందుకు నిరాకరించింది. ప్రభుత్వ చర్యలను "చట్టవిరుద్ధం" అని ఖండించింది. తాజాగా, హార్వర్డ్‌కు వెళ్లే వారి వీసా దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలించాలని విదేశాల్లోని తమ కాన్సులేట్ కార్యాలయాలకు ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా, ట్రంప్ 1964లో ఫోర్డ్‌హాం విశ్వవిద్యాలయంలో చేరి, రెండేళ్ల తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కామర్స్‌కు మారి అక్కడ పట్టభద్రులయ్యారు.
Donald Trump
Harvard University
Michael Wolff
Anti-Semitism
US Federal Funding
International Students
Trump Harvard Controversy
University of Pennsylvania
Taylor Rogers
Visa Applications

More Telugu News