చరిత్ర సృష్టించిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌... ఐపీఎల్ ప్లేఆఫ్స్ హిస్ట‌రీలో సరికొత్త రికార్డ్‌!

  • ముల్లాన్‌పూర్ వేదిక‌గా నిన్న‌ ఎలిమినేటర్ మ్యాచ్‌
  • ఉత్కంఠ పోరులో ముంబ‌యి విజ‌యం 
  • ఐపీఎల్ ప్లేఆఫ్స్ చ‌రిత్ర‌లో ఇరు జ‌ట్లూ క‌లిపి అత్య‌ధిక స్కోర్ (436)
  • ఈ మ్యాచ్‌లో ఎంఐ 228 ర‌న్స్ చేస్తే.. 208 ప‌రుగులు చేసిన జీటీ  
శుక్రవారం ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఐపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో ముంబ‌యి ఇండియన్స్ (ఎంఐ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. ఉత్కంఠ పోరులో ముంబ‌యికి విజ‌యం ద‌క్కింది. ఎంఐ నిర్దేశించిన 229 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో జీటీ 208 ప‌రుగులే చేసింది. దీంతో ఎంఐ 20 ర‌న్స్ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. త‌ద్వారా క్వాలిఫ‌య‌ర్‌-2కి అర్హ‌త సాధించింది. 

ఈ క్ర‌మంలో ఓ స‌రికొత్త రికార్డు న‌మోదైంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చ‌రిత్ర‌లో ఇరు జ‌ట్లూ క‌లిపి అత్య‌ధిక స్కోర్ (436) చేసిన మ్యాచ్ (ఎంఐ-228, జీటీ-208)గా ఇది నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానంలో 2014లో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2(పీబీకేఎస్ వ‌ర్సెస్ సీఎస్‌కే-428) మ్యాచ్ ఉంది. 

ఇక‌, మూడో స్థానంలో 2016లో జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డ ఎస్ఆర్‌హెచ్‌, ఆర్‌సీబీ క‌లిపి 408 ప‌రుగులు చేశాయి. ఆ త‌ర్వాత నాలుగు, ఐదో స్థానాల్లో వ‌రుస‌గా 2023లో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్-2 (జీటీ వ‌ర్సెస్ ఎంఐ-404 ర‌న్స్‌), 2022లో జ‌రిగిన ఎలిమినేట‌ర్ (ఆర్‌సీబీ వ‌ర్సెస్ ఎల్ఎస్‌జీ-400 ప‌రుగులు) ఉన్నాయి. 


More Telugu News