Balochistan Liberation Army: పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తున్న బలూచ్ ఆర్మీ... మరో కీలక నగరం స్వాధీనం

Balochistan Liberation Army Seizes Key City Surab in Pakistan
  • సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న బలూచ్ ఆర్మీ
  • అదనపు డిప్యూటీ కమిషనర్ మృతి
  • క్వెట్టా-కరాచీ, సురబ్-ఘిదర్ హైవేలపై బీఎల్ఏ సోదాలు
పాకిస్థాన్‌కి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని కీలకమైన సురబ్ నగరాన్ని తమ సాయుధ యోధులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు బీఎల్ఏ ప్రకటించింది. 

బీఎల్ఏ ప్రతినిధి జియాంద్ బలోచ్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, సురబ్ నగరంలోని స్థానిక లెవీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, ఒక బ్యాంకు ఇప్పుడు తమ ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. పెద్ద సంఖ్యలో బీఎల్ఏ యోధులు సురబ్ నగరంలోని కీలక ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అంతేకాకుండా, క్వెట్టా-కరాచీ, సురబ్-ఘిదర్ ప్రధాన రహదారులపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో, అదనపు డిప్యూటీ కమిషనర్ (ఏడీసీ) హిదాయత్ ఉల్లా ఊపిరాడక మరణించినట్లు తెలిసింది. సాయుధ దుండగులు ఆయన్ను ఒక గదిలో బంధించడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. సురబ్ ప్రాంతంలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని, బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయని స్థానిక వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం లేదా భద్రతా సంస్థల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అవకాశం దొరికినప్పుడల్లా పాక్ సైనిక బలగాలపై విరుచుకుపడుతూ, నగరాలను స్వాధీనం చేసుకుంటూ బీఎల్ఏ ముందుకు సాగుతుండటం గమనార్హం. 
Balochistan Liberation Army
BLA
Balochistan
Pakistan
Surab
Quetta Karachi Highway
Insurgency
Baloch Army
Terrorism
జియాంద్ బలోచ్

More Telugu News