Arkansas School Fight: పిల్లల ముందే పిడిగుద్దులు.. అమెరికా స్కూల్‌లో తన్నుకున్న తల్లిదండ్రులు.. వీడియో ఇదిగో!

- ఆర్కాన్సాస్‌లో స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక రసాభాస
- తల్లిదండ్రుల మధ్య మొదలైన వాగ్వివాదం
- భయంతో బిక్కచిక్కిపోయిన చిన్నారులు
- గొడవ ఆపాలని పెద్దలను వేడుకున్న పసిపిల్లలు
- ఘటనను తీవ్రంగా ఖండించిన పాఠశాల యాజమాన్యం
- బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటన
అమెరికాలోని ఆర్కాన్సాస్ రాష్ట్రంలో ఓ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పిల్లల తల్లిదండ్రుల మధ్య చెలరేగిన ఓ చిన్నపాటి వాగ్వివాదం చినికిచినికి గాలివానలా మారి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకునేంత వరకు వెళ్లింది. ఈ గొడవను చూసి చిన్నారులు తీవ్ర భయాందోళనలకు గురై, కన్నీరు పెట్టుకుంటూ గొడవను ఆపాలని తల్లిదండ్రులను వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
వెస్ట్ మెంఫిస్ నగరంలోని ఫాల్కీ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ నెల 28న గ్రాడ్యుయేషన్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ క్రమంలో కొందరు మహిళల మధ్య ఏదో విషయమై మాటామాటా పెరిగింది. అది కాస్తా తీవ్రంగా మారి, చివరికి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే దాకా వెళ్లింది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు పురుషులు కూడా ఈ గొడవలో భాగమై, పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. అయితే, ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ అవాంఛనీయ ఘటనను సదరు పాఠశాల యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఇటువంటి ప్రవర్తన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ గొడవకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. "విద్యార్థులు, సిబ్బంది భద్రత, పాఠశాల ప్రాంగణ రక్షణకే మా మొదటి ప్రాధాన్యం. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తునకు మేం పూర్తిగా సహకరిస్తాం" అని పాఠశాల యాజమాన్యం ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.