Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

- వైసీపీ నేత వల్లభనేని వంశీకి అనారోగ్యం
- శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది
- విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్సకు తరలింపు
- హైకోర్టు ఆదేశాల మేరకు వైద్య సేవలు
వైసీపీ నేత, పలు కేసులలో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత కొన్నిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన, వైద్య సహాయం కోసం విజ్ఞప్తి చేసుకున్నారు.
వంశీ అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు, ఆయనకు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, విజయవాడ జిల్లా జైలు అధికారులు పోలీసుల సహాయంతో వంశీని ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి, చికిత్స అందించనున్నారు.
అయితే, వల్లభనేని వంశీ ఆసుపత్రికి చేరుకున్న సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంశీని ఆసుపత్రి లోపలికి తీసుకెళుతున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులకు, ఆసుపత్రి సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.