KTR: కాళేశ్వరం ప్రాజెక్టును చైనా త్రీ గోర్జెస్ డ్యామ్‌తో పోల్చిన కేటీఆర్

KTR Compares Kaleshwaram Project to Chinas Three Gorges Dam

  • లండన్‌లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ కీలక ప్రసంగం
  • బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రగతి ప్రపంచానికే ఆదర్శమని వ్యాఖ్య
  • సంపద సృష్టించి, అట్టడుగు వర్గాలకు పంచడమే తమ విధానమని వెల్లడి
  • కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల విజయాలను ప్రస్తావించిన కేటీఆర్
  • కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేశామన్న కేటీఆర్

బలమైన నాయకత్వం, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పం ఉంటే ఎంతటి ప్రగతినైనా సాధించవచ్చని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలనా కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు కేవలం దేశానికే పరిమితం కాకుండా, ప్రపంచ దేశాలకు సైతం ఒక నమూనాగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.

లండన్‌లో జరుగుతున్న 'బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025' సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ‘స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో తెలంగాణ ఎందుకు ముఖ్యం?’ అనే అంశంపై ఆయన ప్రధాన ఉపన్యాసం చేశారు.

కేటీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మకమైన విధానాలను అనుసరించామని తెలిపారు. వివిధ రంగాల్లో చేపట్టిన మార్పులు, అనుసరించిన వ్యూహాలు, వాటి ద్వారా తాను పొందిన అనుభవాలు, ఆలోచనలను సభికులతో పంచుకున్నారు.

కేసీఆర్ నాయకత్వంలోని తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల మధ్య అద్భుతమైన సమతుల్యతను సాధించిందని వివరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పాలనను ప్రజలకు మరింత చేరువ చేశామని, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించే విధానాలకు పెద్దపీట వేశామని కేటీఆర్ గుర్తుచేశారు. విప్లవాత్మక మార్పులను స్వాగతించడంతో పాటు, నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరించడం వల్లే తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.

తమ పాలనలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టుల గురించి కేటీఆర్ ప్రస్తావించారు. ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్‌తో పోల్చదగిన ప్రాజెక్టు తెలంగాణలోని కాళేశ్వరం అని ఆయన అభివర్ణించారు. కేవలం మూడేళ్ల రికార్డు సమయంలో అన్ని అనుమతులు సాధించి, నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించి ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని, ఇది దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిందని అన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సీజన్‌లో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా, కేసీఆర్ మార్గనిర్దేశంలో దేశంలోనే తొలిసారిగా కోటి ఇళ్లకు మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన వివరించారు. సంపదను సృష్టించడమే కాకుండా, దాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు సమానంగా పంచడమే తమ హయాంలో తెలంగాణను దేశంలోనే ప్రత్యేకంగా నిలబెట్టిందని కేటీఆర్ అన్నారు.

KTR
KTR Kalashwaram Project
Telangana development
Bridge India Week 2025
Kaleshwaram Project
  • Loading...

More Telugu News