Seethakka: పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై వ్యక్తికి మూర్చ.. కాన్వాయ్ ఆపి సాయం చేసిన మంత్రి సీతక్క

- హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై స్పృహ కోల్పోయిన వాహనదారుడు
- వెంటనే స్పందించి కాన్వాయ్ నిలిపివేసిన మంత్రి సీతక్క
- బాధితుడికి స్వయంగా ప్రథమ చికిత్స అందించిన మంత్రి
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట వద్ద శుక్రవారం సాయంత్రం ఒక సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి సీతక్క తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తికి సకాలంలో సహాయం అందించి ఆదుకున్నారు.
వివరాల్లోకి వెళితే, శుక్రవారం సాయంత్రం పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదుగా వెళుతున్న ఒక వాహనదారుడు మూర్ఛ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అటుగా తన కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న మంత్రి సీతక్క ఆయనను గమనించారు. వెంటనే స్పందించి తన వాహనశ్రేణిని ఆపాలని ఆదేశించారు. వాహనం దిగి, అస్వస్థతకు గురైన వ్యక్తి వద్దకు చేరుకున్నారు.
ఆ వ్యక్తి చేతిలో తాళం చెవులు ఉంచి, స్పృహలోకి వచ్చేంత వరకు ఆమె అక్కడే ఉన్నారు. తక్షణ వైద్య సహాయం కోసం అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మంత్రి హోదాలో ఉన్నప్పటికీ, కేవలం అధికారులకు సూచనలు ఇవ్వడమే కాకుండా, స్వయంగా బాధితుడికి సేవలు చేయడం పట్ల అక్కడున్న వారు హర్షం వ్యక్తం చేశారు.