Satya Nadella: 6 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు కారణం చెప్పిన సత్య నాదెళ్ల!

- సుమారు 6,000 మంది ఉద్యోగుల తొలగింపు..
- ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాలపైనా ప్రభావం
- కంపెనీ ఉద్యోగుల అంతర్గత సమావేశంలో వివరణ ఇచ్చిన సత్య నాదెళ్ల!
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో ఇటీవలి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియపై ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. 6 వేల మంది ఉద్యోగుల తొలగింపు చేపట్టింది వారి పనితీరు ఆధారంగా కాదని, సంస్థాగత పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో నాదెళ్ల ఈ విషయాలను వెల్లడించినట్లు ఓ కథనం పేర్కొంది.
సుమారు 6,000 మంది ఉద్యోగులను, అంటే సంస్థలోని మొత్తం ఉద్యోగులలో దాదాపు 3 శాతం మందిని తొలగించనున్నట్లు మైక్రోసాఫ్ట్ కొన్ని వారాల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తొలగింపులు ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపడం గమనార్హం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో ఇంజనీరింగ్ ఉద్యోగాలకు కూడా మినహాయింపు లేదని ఇది సూచిస్తోంది. ఇదే సమావేశంలో, తమ కోపైలట్ ఏఐ అసిస్టెంట్లను కస్టమర్ల వర్క్‌ఫోర్స్‌లో వేగంగా విస్తరించడంపై మైక్రోసాఫ్ట్ ప్రధానంగా దృష్టి సారించిందని నాదెళ్ల నొక్కిచెప్పారు.