Kamal Haasan: నేనేం తప్పు చేశానని క్షమాపణలు చెప్పాలి?: కమల్ హాసన్

- కన్నడ భాషపై చేసిన కామెంట్స్‌కు క్షమాపణ చెప్పనన్న కమల్ హాసన్
- తప్పు చేస్తేనే క్షమాపణలు అడుగుతానని స్పష్టం
- క్షమాపణ చెప్పకుంటే 'థగ్ లైఫ్' సినిమాను అడ్డుకుంటామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ హెచ్చరిక
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణ చెప్పాలనే డిమాండ్లను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. నేనేం తప్పు చేశానని క్షమాపణలు చెప్పాలి?... నేను తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను అని స్పష్టం చేశారు. ‘థగ్ లైఫ్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కన్నడ భాష గురించి కమల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వివాదంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
"నేను ఏదైనా విషయంలో తప్పు చేస్తే కచ్చితంగా క్షమాపణ చెబుతాను. తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పను. ఇది నా పద్ధతి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని పూర్తిగా నమ్ముతాను, వాటిని గౌరవిస్తాను" అని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, తమిళం నుండే కన్నడ భాష పుట్టిందంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్కడి అధికార, విపక్ష పార్టీలు ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించింది. ఇవాళ్టిలోగా (మే 30) కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే, ఆయన నటిస్తున్న 'థగ్ లైఫ్' సినిమా విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని కేఎఫ్‌సీసీ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.
మరోవైపు, తన వ్యాఖ్యలపై కమల్ హాసన్ ఇప్పటికే ఓ వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు తాను ప్రేమతో చేసినవేనని, ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదని ఆయన అన్నారు. భాషా చరిత్ర గురించి ఎంతో మంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల వెనుక మరో ఉద్దేశం లేదని తెలిపారు. అయితే, భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని, ఈ విషయం తనకు కూడా వర్తిస్తుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతానికి, కేఎఫ్‌సీసీ విధించిన గడువు నేటితో ముగియనుండటంతో 'థగ్ లైఫ్' సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది.