B.Tech Ravi: పులివెందులలో టీడీపీ తోరణాల తొలగింపు... బీటెక్ రవి స్పందన

- పులివెందుల రింగ్ రోడ్డు చుట్టూ వైఎస్ విగ్రహాలు ఉన్నాయన్న బీటెక్ రవి
- వైఎస్ విగ్రహాలను ముట్టుకోకుండా తోరణాలు కట్టామని వెల్లడి
- తోరణాలు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఏర్పాటు చేసిన తోరణాలను తొలగించిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ సంఘటనకు సంబంధించి వైసీపీకి చెందిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీటెక్ రవి మాట్లాడుతూ... పులివెందుల రింగురోడ్డు చుట్టూ వైఎస్సార్ విగ్రహాలు ఏర్పాటు చేశారని, అయితే మహానాడు సందర్భంగా తాము ఎక్కడా వైఎస్సార్ విగ్రహాలకు తగిలే విధంగా తోరణాలు కట్టలేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ తోరణాలు తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీటెక్ రవి వైసీపీ నాయకత్వంపై, ముఖ్యంగా వైఎస్ కుటుంబ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "నిజమైన వైఎస్సార్ అభిమానులు ఒక్కసారి ఆలోచించాలి. వైఎస్ విజయమ్మపై కేసు నమోదు చేయించిన వారెవరో, వైఎస్ షర్మిలకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తిని రాకుండా అడ్డుకుంది ఎవరో ఆలోచించాలి. రాజశేఖర్ రెడ్డి రాముడైతే, లక్ష్మణుడిలా పనిచేసిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి. అలాంటి వివేకాను హత్య చేసిన కేసులో అభియోగాలు ఎవరు ఎదుర్కొంటున్నారు?" అని ఆయన నిలదీశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారని బీటెక్ రవి తీవ్రంగా విమర్శించారు.
పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం అని బీటెక్ రవి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని... అలా చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. "పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది వైసీపీ నాయకులే. గతంలో కడప నుంచి వస్తున్న నన్ను అరెస్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పింది మీరు కాదా?" అని ప్రశ్నించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి తన తల్లిని అడ్డుపెట్టుకుని సీబీఐ విచారణ నుంచి తప్పించుకున్నారని కూడా బీటెక్ రవి ఆరోపించారు. ఈ పరిణామాలు పులివెందుల రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి.