Vinay P: భార్య సంవత్సరాలుగా దాచిపెట్టిన నిజాన్ని తెలుసుకున్న భర్త.. హోటల్ గదిలో ఆత్మహత్య

- బెంగళూరులోని నగరభావిలో ఘటన
- ఆత్మహత్యకు ముందు చెల్లెలికి ఐఫోన్ పాస్‌వర్డ్ పంపిన వినయ్
- భార్య సంధ్యపై ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ కేసు నమోదు
భార్యకు గతంలోనే వివాహం జరిగిందన్న విషయం తెలుసుకున్న ఓ సివిల్ కాంట్రాక్టర్ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగళూరు పరిధిలోని నగరభావిలో ఈ నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని చంద్రా లేఅవుట్ II స్టేజ్‌కు చెందిన వినయ్ పి (41)గా గుర్తించారు. ఆయన ఆత్మహత్యకు భార్య వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చెల్లెలికి చివరి సందేశం
మే 24న తెల్లవారుజామున 4 గంటల సమయంలో వినయ్ తన ఐఫోన్ పాస్‌వర్డ్‌ను తన చెల్లెలికి మెసేజ్ రూపంలో పంపించాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె వెంటనే వినయ్‌కు ఫోన్ చేయగా స్పందన రాలేదు. ఆందోళనకు గురైన ఆమె, బంధువుల సహాయంతో వినయ్ ఉన్న ప్రదేశాన్ని ట్రేస్ చేయగా నగరభావిలోని ఓ హోటల్‌లో ఉన్నట్లు తెలిసింది. వారు హోటల్‌కు చేరుకుని చూడగా, వినయ్ గది లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తలుపులు బద్దలుకొట్టి చూడగా, వినయ్ కిటికీ గ్రిల్స్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
పెళ్లి, మనస్పర్థలు.. క్షీణించిన బంధం
వినయ్, సంధ్య (పేరు మార్చాం) 2017లో ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమై, వసంత్ నగర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఓ కుమార్తె జన్మించింది. అయితే, కొద్దికాలానికే వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. వినయ్ చెల్లెలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సంధ్య తన భర్తను కుటుంబ సభ్యుల నుంచి దూరం చేసింది. ఆ తర్వాత దంపతులిద్దరూ రాజాజీనగర్‌లో విడిగా నివసించడం ప్రారంభించారు. ఈ క్రమంలో 2019లో తన భార్యకు అంతకుముందే మరొక వ్యక్తితో వివాహమైందన్న విషయం తాజాగా వినయ్‌కు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన వినయ్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
మద్యానికి బానిస.. భార్యపై ఆరోపణలు
వైవాహిక జీవితంలోని ఈ తీవ్ర ఒత్తిడి కారణంగా వినయ్ మద్యానికి బానిసైనట్టు తెలిసింది. ఈ సమయంలోనే ఆయన ఓ ఇల్లు నిర్మించి, దానిని భార్య సంధ్య పేరు మీద రిజిస్టర్ చేయించాడు. సంబంధాన్ని చక్కదిద్దుకోవడానికి వినయ్ ప్రయత్నించినప్పటికీ సంధ్య మోడలింగ్, యాక్టింగ్ కెరీర్‌లో స్థిరపడేందుకు విడాకులు కావాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలున్నాయి. వినయ్ అందుకు నిరాకరించడంతో, ఆమె తన కుమార్తెను కూడా వేధించినట్లు ఆయన సోదరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో వినయ్ మానసిక ఆరోగ్యం క్షీణించడంతో సంధ్య ఓ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించారు. ఈ ఏడాది జనవరిలో ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. వినయ్ మరణం అనంతరం ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.