Salman Khurshid: ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ వికసిస్తోంది.. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్

Salman Khurshid says Kashmir is developing after Article 370 repeal
  • రద్దుకు ముందు కశ్మీర్ వేరే ప్రాంతమనే భావన ఉండేదని వ్యాఖ్య
  • ఇండోనేషియాలో పర్యటిస్తున్న ఎంపీల బృందంతో పాటు వెళ్లిన ఖుర్షీద్
  • వరుసగా బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్న కాంగ్రెస్ నేతలు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ వికసిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దుర్నీతిని ఎండగట్టేందుకు ఎంపీల బృందం ఇండోనేషియాలో పర్యటిస్తోంది. ఈ బృందంతో పాటు సల్మాన్ ఖుర్షీద్ కూడా ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం అక్కడ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఖుర్షీద్ మాట్లాడారు. 

‘ఆర్టికల్ 370 తో కశ్మీర్ ఓ ప్రత్యేకమైన ప్రాంతమనే భావన ఉండేది. భారత్ లో అంతర్భాగంగా ఉన్నట్లు అనిపించేది కాదు. తాము విడిగా ఉన్నామనే అభిప్రాయం అక్కడ చాలామందిలో ఉండేది. అయితే, 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేశాక ఈ భావన తొలగిపోయింది. ఈ నిర్ణయం జమ్మూకశ్మీర్ లో అభివృద్ధికి బాటలు వేస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేశాక అక్కడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 65 శాతం ఓట్లు పోలవడమే దీనికి నిదర్శనం’ అని ఖుర్షీద్ అన్నారు.

అయితే, గతంలో ఆర్టికల్ 370పై సల్మాన్ ఖుర్షీద్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఖుర్షీద్ స్పందిస్తూ.. ఆర్టికల్ 370 అనేది జమ్మూకశ్మీర్ ను భారత్ తో కలిపి ఉంచేందుకు మార్గం చూపిందని అప్పట్లో వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేతలు వరుసగా ప్రశంసలు కురిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుండగా, ఇప్పుడు సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా పరోక్షంగా బీజేపీని మెచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
Salman Khurshid
Article 370
Jammu Kashmir
Kashmir development
Indonesia
Congress Party
Shashi Tharoor
Indian Politics

More Telugu News