Shehbaz Sharif: దాడికి మేం సిద్ధమవుతుండగానే బ్రహ్మోస్ తో భారత్ విరుచుకుపడింది.. పాక్ ప్రధాని

Shehbaz Sharif Reveals Pakistan Strike Plans Foiled by India Brahmos
  • అజర్ బైజాన్ లో వెల్లడించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
  • భారత్ దాడులు నిజమేనని మళ్ళీ ఒప్పుకున్న షరీఫ్
  • ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ ప్రధాని నోట వాస్తవాలు
  • రావల్పిండి విమానాశ్రయం సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా దాడులు
భారత్ తో సైనిక ఘర్షణకు సంబంధించి పాకిస్థాన్ ప్రధాని పలు కీలక విషయాలను వెల్లడించారు. తమ భూభాగంపై బ్రహ్మోస్ క్షిపణుల ప్రయోగం నిజమేనని ఆయన మరోసారి అంగీకరించారు. తమ సైన్యం సిద్ధంగా లేని సమయంలో ఈ దాడులు జరిగాయని చెప్పారు. ఈ మేరకు గురువారం అజార్ బైజాన్ లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. "మే 9-10 రాత్రి, భారత దురాక్రమణకు మేం స్పందించాలనుకున్నాం. ఉదయం 4:30 గంటలకు దాడి చేయాలని నిర్ణయించాం. దాడి చేసేందుకు మా దళాలు సిద్ధమయ్యాయి. కానీ, మేం దాడి చేసేలోపే భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో రావల్పిండి విమానాశ్రయం సహా పాకిస్థాన్‌లోని వివిధ ప్రావిన్సులపై దాడి చేసింది" అని వివరించారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది మరణించిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ ఆపరేషన్ వల్ల పాకిస్థాన్‌లో తీవ్ర నష్టం వాటిల్లిందని షరీఫ్ అంగీకరించడం ఇది రెండోసారి. గతంలో, మే 10 తెల్లవారుజామున 2:30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ ఫోన్ చేసి నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత క్షిపణి దాడుల గురించి తెలిపారని ఇస్లామాబాద్‌లో ఆయన వెల్లడించారు.

భారత దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. అనంతరం పాకిస్థాన్ డ్రోన్లతో భారత పౌర ప్రాంతాలపై దాడి చేయగా, భారత్ పాక్ సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేసింది. మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించింది.
Shehbaz Sharif
Pakistan
India
Brahmos missile
surgical strike
Azarbaizan
ISI
terrorism
ceasefire agreement
LoC

More Telugu News