Indians: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 1,100 మంది భారతీయులను బహిష్క‌రించిన యూఎస్

Randhir Jaiswal on 1100 Indians Deported from US

  • ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 1,100 మంది భారతీయుల బహిష్క‌ర‌ణ‌
  • ఈ మేర‌కు గురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్ల‌డి
  • ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన జనవరి నుంచి ఇప్పటివరకు 1,080 మంది ఇండియ‌న్స్ స్వ‌దేశానికి

ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 1,100 మంది భారతీయులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది. ఆ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన జనవరి నెల నుంచి ఇప్పటివరకు 1,080 మంది భారతీయులను బహిష్కరించారని చెప్పారు.

వీరిలో 62 శాతం వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారన్నారు. అక్రమ వలసలకు సంబంధించి రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతుందని, అందుకే అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించిన వారిని మన దేశం వెనక్కి ర‌ప్పిస్తుంద‌ని ఆయన వివరించారు. 

"వలస సమస్యపై భారత్‌, అమెరికా మధ్య మంచి సన్నిహిత సహకారం ఉంది. అక్కడ అక్రమ హోదా కలిగి ఉన్న, చట్టవిరుద్ధంగా అక్కడికి ప్రయాణించిన భారతీయ పౌరులను బహిష్కరించే విషయంలో... వారి గురించి పూర్తి వివరాలు అందిన తర్వాత అన్ని విష‌యాలు ధ్రువీక‌రించుకున్నాక‌ మేము వారిని తిరిగి స్వ‌దేశానికి ర‌ప్పిస్తున్నాం. మేము ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగా వారి జాతీయతలను మేము ధృవీకరిస్తాం. ఆ తర్వాత మాత్రమే వారిని తిరిగి ఇండియాకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం" అని ఆయన అన్నారు.

తప్పిపోయిన ముగ్గురు భార‌తీయుల కోసం ఇరాన్‌తో సంప్రదింపులు: రణధీర్‌ జైశ్వాల్‌ 
ఇక‌, ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయ పౌరులను గుర్తించడం కోసం భారతదేశం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. ఇరాన్ వైపు నుంచి కూడా మంచి సహకారం లభిస్తోందని విలేకరుల సమావేశంలో తెలిపారు. తప్పిపోయిన ముగ్గురు వ్యక్తుల కుటుంబ సభ్యులకు మంత్రిత్వ శాఖ అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని చెప్పారు. 

Indians
Randhir Jaiswal
Indian Deportation
US Deportation
Illegal Immigration
MEA
United States
Iran
Missing Indians
Indian Citizens
Immigration Issues
  • Loading...

More Telugu News