Indian SIM Cards: పాకిస్థాన్‌కు ఇండియ‌న్ సిమ్ కార్డులు పంపిన వ్య‌క్తి అరెస్ట్

Kasim Arrested for Sending Indian SIM Cards to Pakistan

  • రాజస్థాన్‌లోని మేవాట్ ప్రాంతంలో పాక్ శిక్షణ పొందిన ఐఎస్‌ఐ ఏజెంట్ కాసిం అరెస్టు 
  • గూఢచర్యం, భారత సిమ్ కార్డులను పాక్‌కు పంపిన నిందితుడు
  • కాసిం రెండుసార్లు పాక్‌ను సందర్శించి ఐఎస్ఐ వ‌ద్ద‌ గూఢచారి శిక్షణ పొందిన వైనం

పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన కాసిం అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం గురువారం అరెస్టు చేసింది. కాసింను రాజస్థాన్‌లోని మేవాట్‌లోని డీగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అత‌డు పోలీసు రిమాండ్‌లో ఉన్నాడు.

అధికారులు చెప్పిన వివ‌రాల‌ ప్రకారం... కాసిం రెండుసార్లు పాకిస్థాన్‌ను సందర్శించాడు. ఒకసారి 2024 ఆగస్టులో, అలాగే మళ్లీ 2025 మార్చిలో పాక్ వెళ్లాడు. మొత్తం 90 రోజులు అక్కడే ఉన్నాడు. ఈ సందర్శనల సమయంలో అతను ఐఎస్ఐ హ్యాండ్లర్లు, సీనియర్ ఆపరేటివ్‌ల వ‌ద్ద‌ గూఢచర్య శిక్షణ పొందాడు.

దర్యాప్తులో కాసిం భారత సిమ్ కార్డులను పాకిస్థాన్‌కు పంపుతున్నాడని, ఆ తర్వాత పాక్‌ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIO) భారతీయులను వాట్సాప్ ద్వారా సంప్రదించి సున్నితమైన సైనిక, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేవారని తేలింది.

అలాగే కాసిం భారత్‌లో అనేక మందిని తీవ్రవాదం వైపు మ‌ళ్లించాడ‌ని కూడా ఆరోపణలు ఉన్నాయి. అతనికి విస్తృతమైన నెట్‌వర్క్ ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇక‌, అతని సోదరుడు ఐఎస్ఐ ఏజెంట్. ప్రస్తుతం అత‌డు పరారీలో ఉన్నాడు.

భార‌త ఆర్మీకి సంబంధించిన స‌మాచారాన్ని తెలుసుకోవ‌డం కోసం పాక్ ఇంటెలిజెన్స్ భారతీయ మొబైల్ నంబర్‌లను అనుమానాస్పదంగా ఉపయోగిస్తున్నాయని 2024 సెప్టెంబర్‌లో అధికారులు హెచ్చరించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పుడు కాసిం అరెస్ట్ జ‌రిగింది. అత‌ని చర్యలు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని, ఈ నెట్‌వర్క్‌ను వెలికితీయడం నిఘా సంస్థలకు అత్యంత ప్రాధాన్యత గల ఆపరేషన్ అని ఢిల్లీ పోలీసులు కూడా పేర్కొన్నారు.

Indian SIM Cards
Kasim
ISI
Pakistan
espionage
Indian intelligence
Delhi Police
Rajasthan
terror network
Pak intelligence operatives
  • Loading...

More Telugu News