Revanth Reddy: ట్రంప్ కు భయపడి యుద్ధం ఆపారు... మోదీ కాలం చెల్లిన రూపాయి: రేవంత్ రెడ్డి ఫైర్

- ట్రంప్ బెదిరింపులకు మోదీ తలొగ్గారన్న రేవంత్ రెడ్డి
- పాక్‌తో యుద్ధం మధ్యలోనే ఎందుకు ఆపారంటూ నిలదీత
- ఇందిరమ్మ ధైర్యం మోదీలో లేదని విమర్శలు
- దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్ కాళ్ల దగ్గర పెట్టాంటూ ఆగ్రహం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి, పాకిస్థాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ప్రధాని మోదీ అర్ధాంతరంగా నిలిపివేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశ భద్రత విషయంలో ప్రధాని మోదీ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'జై హింద్ యాత్ర' అనంతరం నిజాంపేటలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తిగా సహకరించాం. యుద్ధం చేయాలంటే ధైర్యం, వెన్నెముక, సరైన యుద్ధతంత్రం ఉండాలి. కేవలం నాలుగు రోజులు యుద్ధం చేసి, మధ్యలోనే ఎందుకు ఆపేశారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు. యుద్ధం ప్రారంభించే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, యుద్ధాన్ని నిలిపివేసే సమయంలో ఎందుకు సంప్రదించలేదని ఆయన నిలదీశారు. "అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి యుద్ధం ఆపించానని ప్రకటించారు. ట్రంప్ బెదిరించగానే మోదీ ఎందుకు తలొగ్గారు? ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, మీ సొంత వ్యవహారం కాదు. భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెడతారా?" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గతంలో ఇందిరా గాంధీ ప్రదర్శించిన ధైర్యాన్ని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. "భారత్ వైపు కన్నెత్తి చూస్తే కనుగుడ్లు పీకేస్తామని చైనాను ఇందిరాగాంధీ హెచ్చరించారు. నాడు యుద్ధం ఆపాలని అమెరికా అధ్యక్షుడు బెదిరించినా ఇందిరా గాంధీ లొంగలేదు. అలాంటి యుద్ధతంత్రాన్ని ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటున్నారు" అని అన్నారు. పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం చెప్పాలంటే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం చేసుకోవాలని తాము మోదీకి సూచించామని తెలిపారు. 1971 యుద్ధంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్థాన్‌ను ఓడించిందని గుర్తుచేశారు.
"మేం నిర్వహించిన ఈ యాత్ర ఎన్నికలు, ఓట్ల కోసం కాదు. సైనికుల ఆత్మస్థైర్యం, దేశ ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం. బలూచిస్థాన్‌ను విడగొట్టి మరో దేశంగా చేయమంటే అది చేతకాదు కానీ, కాంగ్రెస్‌ను విమర్శిస్తారు. యుద్ధంలో ఎన్ని రఫేల్ విమానాలు నేలకూలాయో లెక్క చెప్పాలి" అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌ను ఓడించాలంటే ఇందిరాగాంధీ మార్గంలో నడవాలని ప్రధానికి హితవు పలికారు. దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని, ప్రధాని మోదీ కాలం చెల్లిన రూపాయి అని వ్యాఖ్యానించారు.
ఈ జై హింద్ యాత్ర బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు సాగింది. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కుట్ర చేసి కొడంగల్‌లో తనను ఓడించినా, 14 రోజుల్లోనే మల్కాజ్‌గిరి ప్రజలు ఎంపీగా గెలిపించారని, ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజల ముందుకొచ్చానని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.