Vangalapudi Anitha: ఐదేళ్ల గురించి ఆలోచిస్తే పొలిటికల్ లీడర్... 20 ఏళ్ల గురించి ఆలోచిస్తే విజనరీ లీడర్: హోంమంత్రి అనిత

- కడపలో మహానాడు
- ఉద్వేగభరితంగా ప్రసంగించిన టీడీపీ మంత్రులు
- చంద్రబాబు, నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళుతుందని ధీమా
కడప నగరంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు బహిరంగ సభలో ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు తమ ప్రసంగాలతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల నాయకత్వాన్ని కొనియాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.
చంద్రబాబు విజనరీ లీడర్: మంత్రి అనిత
మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, "కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని చంద్రబాబు గారు నిరూపించారు. రాబోయే ఐదేళ్ల గురించి ఆలోచించే వారిని పొలిటికల్ లీడర్ అంటారని, కానీ 20 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవాడిని విజనరీ లీడర్ అంటారని, ఆ విజనరీకి నిలువెత్తు రూపం చంద్రబాబు గారు" అని కొనియాడారు. 75 ఏళ్ల వయసులో కూడా ఆయన 2047 నాటికి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఆశయంతో పనిచేస్తున్నారని తెలిపారు.
గత ఐదేళ్లలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, యువతకు ఉపాధి అవకాశాలు కొరవడ్డాయని ఆరోపించారు. నారా లోకేశ్ 'యువగళం' యాత్ర ద్వారా పార్టీకి పునరుత్తేజం తెచ్చి, కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ప్రకృతి కూడా సహకరించి మహానాడు విజయవంతమైందని, ఇది 'దేవుడి స్క్రిప్ట్' అని ఆమె వ్యాఖ్యానించారు. నిన్న మహానాడులో లోకేశ్ గారు చేసిన ఆరు తీర్మానాలు 2047 అభివృద్ధికి పునాదులు కాబోతున్నాయని, వాటిని గ్రామగ్రామాన తెలియజేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వైఎస్ కుటుంబం దగ్గర ఉంటే మాకు దక్కింది ఇదే: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కార్యకర్తల కృషితోనే గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ కూటమి మంచి ఫలితాలు సాధించిందని అన్నారు. "నేడు చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ ప్రాంతం నుంచి వెళ్లి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదు. టీడీపీ కార్యకర్తలను హింసించడం, హత్యారాజకీయాలు చేయడం తప్ప" అని ఆరోపించారు. వైఎస్ కుటుంబం దగ్గర ఉంటే చివరకు హింసే దక్కిందని, అందుకే వారిని వ్యతిరేకించి టీడీపీలోకి వచ్చామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. టీడీపీతోనే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అన్న ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన హంద్రీనీవా, గాలేరు ప్రాజెక్టులను చంద్రబాబే ఒక రూపానికి తెచ్చారని గుర్తుచేశారు.
రాయలసీమ అభివృద్ధి ప్రదాత చంద్రబాబు: మంత్రి సవిత
కడప జిల్లా ఇంచార్జి మంత్రి, పెనుగొండ ఎమ్మెల్యే సవిత మాట్లాడుతూ, "ఒకప్పుడు రాయలసీమను ఫ్యాక్షన్ సీమగా పిలిచేవారు. కడప జిల్లా అంటే బాంబులు, హింస అనే భయం ప్రజల్లో ఉండేది. అలాంటి సమయంలో చంద్రబాబు గారు రాయలసీమను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడిగా నిలిచారు" అని ప్రశంసించారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మహిళలకు భద్రతను, యువతకు భరోసాను అందించిందని, ఈ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. కడప మహానాడులో ప్రజల ఉత్సాహం చూసి వైసీపీ అధినేత జగన్ రెడ్డి 'పిచ్చికూతలు' కూస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పది నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, సూపర్ సిక్స్ పథకాలతో పాటు చెప్పని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలుచేస్తోందని తెలిపారు.
కడప అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే మాధవి రెడ్డి
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాట్లాడుతూ, తిరుమలేశుని తొలి గడప అయిన కడపలో మహానాడు జరగడం జిల్లావాసులకు దక్కిన గౌరవమని అన్నారు. "అశేషంగా వచ్చిన జనాలను చూస్తే కడప గడ్డ తెలుగుదేశం అభిమానుల అడ్డా అని రుజువైంది" అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన పార్టీ అని అన్నారు. చంద్రబాబు అంటే పట్టుదల, క్రమశిక్షణ, నేర్పు, ఓర్పుకు నిదర్శనమని, అభివృద్ధి అంటే ఆయన పేరే గుర్తుకు వస్తుందని కొనియాడారు. "పోలవరాన్ని పూర్తి చేసి కృష్ణా నీటిని బనకచర్ల వరకు తీసుకువస్తే రాయలసీమ అభివృద్ధిని ఆపే శక్తి ఎవరికీ లేదు. చంద్రబాబు ముందుచూపు వల్లే నేడు రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో ఎంతో మంది రైతు బిడ్డలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అయ్యారు" అని వివరించారు. గతంలో తనపై వ్యక్తిగత దాడులు జరిగాయని గుర్తుచేస్తూ, టీడీపీ కార్యకర్తను టచ్ చేస్తే అదే వారి చివరి తప్పు అవుతుందని హెచ్చరించారు.