Tamil Nadu dental clinic: ఒక సెలైన్ బాటిల్ కారణంగా 8 మంది మృతి!

- తమిళనాడు డెంటల్ క్లినిక్‌లో ఘోరం
- న్యూరోమెలియోయిడోసిస్‌తో 8 మంది మృతి!
- 2023లో ఘటన
- ది లాన్సెట్ సంచలన కథనం
తమిళనాడులో ఓ డెంటల్ క్లినిక్ నిర్లక్ష్యం ఎనిమిది మంది ప్రాణాలను బలిగొంది. తిరుపత్తూరు జిల్లా వాణియంబాడిలోని ఓ దంత వైద్యశాలలో 2023లో జరిగిన ఈ ఘోర దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూరోమెలియోయిడోసిస్ అనే అరుదైన, ప్రమాదకరమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి వీరు మరణించినట్లు ప్రఖ్యాత వైద్య పత్రిక 'ది లాన్సెట్' తాజాగా సంచలన కథనాన్ని ప్రచురించింది.
క్లినిక్‌లో పాటించిన అపరిశుభ్రమైన పద్ధతులే ఈ దారుణానికి కారణమని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) వెల్లూర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (ఐసీఎంఆర్-ఎన్ఐఈ), తమిళనాడు ప్రజారోగ్య విభాగం సంయుక్త దర్యాప్తులో తేలింది.
దంత చికిత్సలకు వాడే సెలైన్ బాటిల్‌ను అపరిశుభ్రమైన పరికరంతో తెరిచి, సరిగా మూయకపోవడమే కాకుండా, అదే కలుషిత సెలైన్‌ను పలువురు రోగులకు వాడారని అధ్యయనం వెల్లడించింది. 'బుర్ఖోల్డేరియా సూడోమల్లై' అనే బ్యాక్టీరియా ఈ విధంగా వ్యాపించి, కనీసం 10 మందికి సోకగా, వారిలో ఎనిమిది మంది (80% మరణాల రేటు) మృత్యువాత పడ్డారు.
ఈ బ్యాక్టీరియా రక్త ప్రవాహంలో కాకుండా, నేరుగా నరాల ద్వారా మెదడుకు చేరి తీవ్ర ఇన్ఫెక్షన్‌కు దారి తీయడం వల్లే మరణాలు వేగంగా సంభవించాయని పరిశోధకులు నిర్ధారించారు. జ్వరం, తలనొప్పి, మాట తడబడటం, దృష్టి లోపాలు దీని ప్రధాన లక్షణాలు. సీఎంసీ వెల్లూర్ న్యూరోమెలియోయిడోసిస్ కేసుల పెరుగుదలను గుర్తించి, మే 2023లో అధికారులను అప్రమత్తం చేసినప్పటికీ, ఈ వ్యాప్తిపై ప్రభుత్వ సంస్థలు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. దర్యాప్తు బృందం క్లినిక్‌ను సందర్శించేలోపే, దానిని క్రిమిరహితం చేసి మూసివేశారు. అయినప్పటికీ, సెలైన్ నమూనాలో బ్యాక్టీరియాను గుర్తించారు.
ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపట్టి వ్యాప్తిని అరికట్టామని, వైద్య సదుపాయాలలో ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల ఆవశ్యకతను ఈ ఘటన నొక్కి చెబుతోందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ టి.ఎస్. సెల్వవినాయగం తెలిపారు.