Lashkar-e-Taiba: జ‌మ్మూకశ్మీర్‌లో ఇద్ద‌రు లష్కరే ఉగ్రవాదుల లొంగుబాటు

Lashkar e Taiba Terrorists Surrender in Jammu Kashmir

  • షోపియాన్‌ జిల్లా బస్కుచాన్ ప్రాంతంలో భ‌ద్ర‌తా అధికారుల‌కు లొంగిపోయిన టెర్ర‌రిస్టులు
  • లష్కరే తొయిబాకు చెందిన‌ ఇర్ఫాన్‌ బషీర్‌, ఉజైర్‌ సలామ్‌ లొంగుబాటు
  • వారి నుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 2 హ్యాండ్‌ గ్రనేడ్లు స్వాధీనం

ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో జమ్మూకశ్మీర్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, పోలీసులు సంయుక్తంగా ఉగ్ర‌వాదుల కోసం వేట కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో నిషేధిత లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు బస్కుచాన్ ప్రాంతంలో భద్రతా దళాల దగ్గర లొంగిపోయారు. 

అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... "క‌శ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లా బస్కుచాన్ ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, పోలీసులు సంయుక్తంగా ఆప‌రేష‌న్ నిర్వ‌హించాయి. ఈ క్ర‌మంలో స్థానికంగా ఉన్న తోట‌లో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందింది. దాంతో వెంట‌నే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 

ఈ క్ర‌మంలో లష్కరే తోయిబాకు చెందిన‌ ఇర్ఫాన్‌ బషీర్‌, ఉజైర్‌ సలామ్‌ లొంగిపోయారు. వారి నుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 2 హ్యాండ్‌ గ్రనేడ్లు, ఇత‌ర మందుగుండు సామాగ్రితో పాటు కొంత న‌గ‌దు  స్వాధీనం చేసుకున్నాం. లొంగిపోయిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు" అని తెలిపారు. 

ఇక‌, పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జ‌రిగిన ఉగ్ర‌దాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లో యాంటీ టెర్రర్‌ ఆపరేషన్‌ను ముమ్మరం చేశామని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 26 మంది ఉగ్రవాదులను అంతమొందించారు. ఈ నెల ప్రారంభంలో షోపియాన్‌, పుల్వామాలోని త్రాల్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. 

Lashkar-e-Taiba
Jammu Kashmir
terrorists surrender
Shopian
security forces operation
Irfaan Bashir
Ujair Salam
Pahalgam attack
anti terror operation
  • Loading...

More Telugu News