North Korea: అమెరికా గోల్డెన్ డోమ్ పై ఉత్తర కొరియా కీలక వ్యాఖ్యలు

- గోల్డెన్ డోమ్ రక్షణ కవచాన్ని రూపొందిస్తున్న అమెరికా
- గోల్డెన్ డోమ్ రక్షణ కవచంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉత్తర కొరియా
- ప్రపంచాన్ని కొత్త ప్రమాదాల దిశగా నడిపించవచ్చన్న ఉత్తర కొరియా విదేశాంగ శాఖ
బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల నుంచి రక్షణ కల్పించేందుకు అమెరికా ప్రభుత్వం గోల్డెన్ డోమ్ రక్షణ కవచాన్ని రూపొందిస్తున్న విషయం విదితమే. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటన చేశారు. అయితే గోల్డెన్ డోమ్ రక్షణ కవచంపై ఉత్తర కొరియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గోల్డెన్ డోమ్ కవచంపై ఉత్తర కొరియా విదేశాంగ శాఖ స్పందించింది.
అమెరికా అభివృద్ధి చేస్తున్న గోల్డెన్ డోమ్ రక్షణ కవచం ప్రపంచాన్ని కొత్త ప్రమాదాల దిశగా నడిపించవచ్చని, అంతరిక్ష అణ్వాయుధ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ కవచం తమ అణ్వాయుధ శక్తిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్న ఉత్తర కొరియా.. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఆయుధ వ్యవస్థల అభివృద్ధి తప్పదని తెలిపింది. అంతరిక్షాన్ని సైనిక రంగంగా మార్చే ఈ చర్యలు మూర్ఖత్వమేనని, అమెరికా అత్యుత్సాహంతో వ్యవహరిస్తోందని విమర్శించింది. గోల్డెన్ డోమ్ వల్ల అంతరిక్ష అణుయుద్ధానికి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది. అమెరికా - దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ చర్యలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారతాయని పేర్కొంది.
గోల్డెన్ డోమ్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తే దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా ప్రత్యామ్నాయ ఆయుధాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు ఉత్తర కొరియా 2022లో చట్టబద్ధంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను పలు మార్లు పరీక్షించి తమ శక్తిని ప్రపంచానికి చూపించేందుకు ప్రయత్నిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్తర కొరియా వ్యూహాత్మకంగా కొత్త ఆయుధాల అభివృద్ధిపై దృష్టి సారించింది.