IPL Playoffs: నేటి నుంచి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌.. గ‌ట్టి భద్రత మ‌ధ్య మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌

IPL Playoffs Security Tightened in Mullanpur
  • ఇవాళ ముల్లాన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫయర్‌-1
  • ఈ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్న‌ పీబీకేఎస్‌, ఆర్‌సీబీ 
  • ఈ గేమ్ కోసం భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశామ‌న్న పంజాబ్‌ స్పెషల్ డీజీపీ 
  • 65 మంది ఉన్నతాధికారులు.. 2,500 మంది పోలీసులతో గ‌ట్టి భద్రత ఏర్పాటు
  • రేపు ఇదే వేదిక‌గా ఎంఐ, జీటీ మ‌ధ్య ఎలిమినేట‌ర్ మ్యాచ్
భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-1, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లకు వేదికైన ముల్లాన్‌పూర్‌లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా త్రివిధ దళాలు పాక్‌లోని ఉగ్రశిబిరాలపై దాడితో పోలీసులు మ్యాచ్‌ కోసం భారీ భద్రత కల్పించారు. ముల్లాన్‌పూర్‌లో ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌లకు గట్టి భద్రత కల్పించామని పంజాబ్ స్పెషల్ డీజీపీ అర్పిత్‌ శుక్లా తెలిపారు.

ఈ వేదిక‌పై ఇవాళ‌, రేపు జ‌రిగే రెండు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు చూసేందుకు దేశం నలుమూలల నుంచి భారీగా ప్రేక్షకులు వచ్చే అవకాశముందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశామని ఆయ‌న పేర్కొన్నారు. 65 మంది ఉన్నతాధికారులకు తోడు 2,500 మంది పోలీసులతో గ‌ట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే వేదిక లోప‌ల‌, చుట్టుప‌క్క‌ల భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్ష‌ణ ఇంఛార్జ్‌గా డీఐజీ స్థాయి అధికారిని నియ‌మించారు. 

ఇక‌, ఇవాళ్టి క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డనున్నాయి. ఇందులో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కి వెళుతుంది. కాగా, రేపు గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ), ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) ఎలిమినేట‌ర్ మ్యాచ్ ఆడ‌నున్నాయి. ఇందులో ఓడిన జ‌ట్టు ఇంటిముఖం ప‌డుతుంది. గెలిచిన జ‌ట్టు క్వాలిఫయర్‌-1 లో ఓడిన టీమ్‌తో క్వాలిఫ‌య‌ర్‌-2 ఆడ‌నుంది.  

ఇదిలాఉంటే... ఏప్రిల్‌ 22న పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్ ఆక్ర‌మిత కశ్మీర్ (పీఓకే), పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై క్షిప‌ణి దాడులు చేసింది. ఆ తర్వాత భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాంతో ఐపీఎల్‌ను వారం పాటు బీసీసీఐ నిలిపివేసింది. 

ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్‌ షెడ్యూల్‌ని మార్చింది. వాస్తవానికి క్వాలిఫయర్‌-1, ఎలిమినేటర్‌ మ్యాచులు హైదరాబాద్‌లో.. క్వాలిఫయర్‌-2, ఫైనల్‌ మ్యాచ్‌ కోల్‌కతాలో జరగాల్సి ఉంది. అయితే, రీషెడ్యూల్‌ తర్వాత క్వాలిఫయర్‌-1, ఎలిమినేటర్‌ మ్యాచ్‌ను ముల్లాన్‌పూర్‌కు, క్వాలిఫయర్‌-2తో పాటు ఫైనల్‌ను అహ్మదాబాద్‌కు మార్చింది.
IPL Playoffs
Punjab Kings
Royal Challengers Bangalore
Gujarat Titans
Mumbai Indians
Mullanpur
Cricket
Security
IPL 2025
Arpit Shukla

More Telugu News