Joel Le Scouarnec: 299 మంది చిన్నారులపై అత్యాచారాలు... ఫ్రాన్స్ వైద్యుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Joel Le Scouarnec Doctor sentenced to 20 years for child abuse in France
  • ఫ్రాన్స్‌లో మాజీ సర్జన్‌ కీచక పర్వం
  • వందలాది మంది రోగులు, ఎక్కువగా పిల్లలపై అత్యాచారాలకు పాల్పడిన వైనం
  • 1989 నుంచి 2014 మధ్య కాలంలో ఈ దారుణాలు
  • తన నేరాలను డైరీలో వివరంగా రాసుకున్న నిందితుడు
ఫ్రాన్స్‌లో వైద్య వృత్తికే తలవంపులు తెచ్చిన దారుణ ఘటన ఇది. వైద్యుడి ముసుగులో ఓ కామాంధుడు దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు సాగించిన అరాచకాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. వందలాది మంది చిన్నారులు అతడి బాధితులు కావడం గమనార్హం. వారిపై లైంగిక దాడులకు పాల్పడిన 74 ఏళ్ల మాజీ సర్జన్ జోయెల్ లె స్కౌర్నెక్‌కు స్థానిక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తన నేరాలన్నింటినీ అంగీకరించిన ఈ దుర్మార్గుడు, ఇప్పటికే మరో కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

1989 నుంచి 2014 మధ్య కాలంలో లె స్కౌర్నెక్ ఈ ఘోరాలకు పాల్పడినట్లు తేలింది. తన పైశాచిక కృత్యాలన్నింటినీ ఓ డైరీలో వివరంగా రాసుకోవడమే కాకుండా, బాధితుల పేర్లను కూడా నమోదు చేయడం విచారణలో కీలక సాక్ష్యంగా మారింది. 2017లో ఓ పొరుగింటి ఆరేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదుతో ఈ పాపాల పుట్ట పగిలింది. అధికారులు జరిపిన సోదాల్లో లక్షలాది అసభ్యకర ఫోటోలు, వీడియోలు, నేరాల చిట్టా ఉన్న నోట్‌బుక్స్‌ లభించాయి. సుమారు 299 మంది బాధితులను గుర్తించగా, వారిలో 158 మంది బాలురు, 141 మంది బాలికలు ఉన్నారు. వైద్యం పేరుతో చిన్నారులను ఒంటరిగా ఉన్నప్పుడు లేదా వైద్యం తర్వాత స్పృహలో లేనప్పుడు లక్ష్యంగా చేసుకునేవాడని తేలింది.

విచారణ సమయంలో లె స్కౌర్నెక్ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, నిర్వికారంగా కనిపించడం గమనార్హం. "నేను వారిని వ్యక్తులుగా చూడలేదు. వారు నా లైంగిక వాంఛలకు (ఫాంటసీలకు) లక్ష్యాలు మాత్రమే" అని కోర్టుకు చెప్పడం అతని వికృత మనస్తత్వానికి అద్దం పడుతుంది. తన మనవరాలిపై, ఐదేళ్ల మేనకోడలిపై కూడా అత్యాచారం చేసినట్లు ఈ నీచుడు అంగీకరించాడు.

ఈ కేసు ఫ్రాన్స్ అధికార యంత్రాంగం వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపింది. 2005లోనే చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో దోషిగా తేలినప్పటికీ, లె స్కౌర్నెక్ వైద్య వృత్తిని కొనసాగించడంపై ప్రాసిక్యూటర్ స్టెఫాన్ కెల్లెన్‌బెర్గర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "తెల్లకోటులో ఉన్న దెయ్యం"గా అభివర్ణిస్తూ, వ్యవస్థ నిర్లక్ష్యం కూడా ఈ నేరాలకు కారణమని ఆయన వాదించారు. దోషిగా తేలిన వ్యక్తిని వైద్య వృత్తిలో కొనసాగించడం, ముఖ్యంగా చిన్నారులకు చికిత్స చేసేందుకు అనుమతించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఫ్రాన్స్ చరిత్రలోనే అతిపెద్ద బాలల లైంగిక వేధింపుల కేసుల్లో ఒకటిగా నిలిచిన ఈ ఉదంతం, సమాజంలో వైద్యులపై ఉన్న నమ్మకాన్ని ప్రశ్నార్థకం చేసింది. బాధితుల ఆవేదన, నిందితుడి నిర్లజ్జ నేరారోపణ అంగీకారం సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Joel Le Scouarnec
France child abuse case
child sexual abuse
pediatrician sexual assault
child pornography
surgeon arrested
child victims
Stephan Kellenberger
child protection
sex crimes

More Telugu News